హిందూ తాత – సెక్యులర్ మనవడు – 4

Sunday, November 16, 2008 15:56
తాత - మనవడు విభాగంలో ప్రచురించబడినది

మనవడు: తాతా, ఈ భీష్ముడి సంగతి కొంచెం తేలుస్తావా?

తాత: శత్రువులకు మరణ రహస్యం చెప్పాడని, అది దేశ ద్రోహం అని భీష్ముడి మీద ఒక అభియోగం. దీని పూర్వాపరాలు కొంచెం చూద్దాం.

  • అప్పటికి 9 రోజుల యుద్ధం ముగిసింది. ఇరుపక్షాలవైపూ విపరీతమైన సైన్య నష్టం జరిగింది. పాండవుల్లో ఒక నిరాశ అలముకుంది. భీష్ముడు ఆయుధం ధరించి ఉండగా విజయం చేజిక్కే మార్గం అసంభవం అని వాళ్ళకు స్పష్టం అయ్యింది.
  • ఉన్నాడుగా నల్లనయ్య. వెళ్ళి మీ తాతకు అతనిచ్చిన ఆశీర్వాదం వెనక్కి ఇచ్చెయ్యి అన్నాడు ధర్మజుడితో. యుద్ధం ప్రారంభింపబడినప్పుడు వెళ్ళి నమస్కరిస్తే విజయీభవ అని అందించిన ఆశీర్వాదం వెనక్కి ఇచ్చేయి అని ధర్మజుడిని ఆదేశిస్తాడు. ధర్మరాజు వెళ్ళి ఇవే చిలకపలుకులు పలికితే భీష్ముడు అడుగుతాడు. ఇప్పుడెందుకు ఇలా వచ్చావని. ధర్మజుడు కారణం చెపితే, కృష్ణుడు పంపించాడా అని అడిగి, శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చెయ్యమని చెప్తాడు.
  • ఇక్కడ భీష్ముడి ధర్మ నిబద్ధతను ప్రశ్నించేముందు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే కృష్ణుడు వెళ్ళి భీష్ముడిని ఎందుకు అడగమన్నాడు అని.
  • కృష్ణుడికి తెలుసుగా శిఖండి భీష్ముడి చావుకి కీలకం అని – ఆ ముక్క కృష్ణుడే చెప్పెయ్యచ్చుగా. పోనీ, శిఖండి పాండవ శిబిరంలోనే యుద్ధం చేస్తున్నాడుగా – తనొచ్చి నన్ను భీష్ముడు ఎదుర్కోడు అన్న విషయం అనచ్చుగా. మర్నాడు యుద్ధారంభంలో దుర్యోధనుడంటాడు శిఖండి కనపడితే పితామహుడు ఆయుధం వదిలేస్తారు – మనం జాగ్రత్తగా ఉండాలి అని. ఇవన్నీ ఎందుకు చెపుతున్నాను అంటే భీష్ముడు పెద్ద రహస్యం ఏమీ చెప్పేయలేదు. అప్పటికి అది బహిరంగరహస్యమే.
  • అయితే కృష్ణుడు ధర్మజుడిని వెళ్ళి పితామహుని అడిగిరమ్మనడంలో ఆంతర్యం ఏమిటంటే – పితామహుని అనుమతి తీసుకురమ్మని. తాతా, ఇలా చేస్తున్నాము. హస్తినాపుర రక్షణకి నీకింకేదైనా మార్గం ఉందా? లేదంటే ఇలా చెయ్యడానికి నీ అనుమతి కావాలి అని.
  • భీష్ముడు కూడా కృష్ణుడు పంపాడని చెప్పాక ఆలోచనలో పడతాడు. కృష్ణుడు పంపినది తన మరణ రహస్యం తెలుసుకోమని పంపలేదు. తనకో ప్రశ్న పంపాడు అని అర్థం అయ్యింది. నీకు దుర్యోధనుడు ముఖ్యమా, హస్తినాపురం ముఖ్యమా అని కృష్ణుడు తేల్చుకోమని చెప్తున్నట్టు అర్థమయ్యింది.
  • పాండవులు గెలుస్తారా, కౌరవులకి భీష్ముడు ద్రోహం చేసాడా ఇవన్నీ తరువాత జరిగేవి – ముందు జరిగేది భీష్ముడి ప్రాణం పోవడం. నన్నిలా చంపండిరా అని చెప్పగలగటం అసలు సాధ్యమేనా?
  • ఏనాడూ భీష్ముడు రాజుకి తలవంచలేదు – రాజ్యానికి తప్ప. హస్తినాపురం అతని కర్మభూమి. కృష్ణుడు తనకి ఎంత మహదావకాశాన్నిచ్చాడో తెలుసుకున్న భీష్ముడి హృదయం ఆనందంతో పొంగిపోయింది.
  • కృష్ణుడు ఇచ్చిన ఆ మహదావకాశం ఏమిటంటే భీష్మునికి హస్తినాపురం పట్ల తన నిబద్ధతని నిరూపించుకునే అవకాశం. అలాకాకుండా కృష్ణుడే విషయం చెప్పేస్తే మరునాటి యుద్ధంలో మామూలుగా భీష్ముడు ఆయుధాన్ని వదిలేసేవాడు. అప్పుడు అతని నిబద్ధత దుర్యోధనుడి పట్లగానీ, హస్తినాపురం పట్లకాదు అని చరిత్రలో నిలచిపోయేది.
  • ఇక్కడ భీష్ముడి ముందు ప్రశ్న ఏమిటంటే తను పాండవులందరినీ చంపి దుర్యోధనుడికి విజయం చేకూర్చగలనా లేక కౌరవులందరినీ చంపి పాండవులకు విజయం ఇవ్వాలా అని. ఇద్దరూ ఉండడం అసంభవం – ఎందుకంటే అది సాధ్యమే అయితే యుద్ధం దాకా కథ వచ్చేదే కాదు. కృష్ణుడు ఆ పక్షంలో ఉండగా పాండవులని చంపగలిగే అవకాశమే లేదు. తనుండగా కౌరవులు ఓడిపోయే అవకాశమే లేదు. సుమారుగా చదరంగం పరిభాషలో చెప్పాలంటే స్టేల్ మేట్ అన్నమాట.
  • హస్తినాపురం సురక్షితంగా ఉండాలంటే యుద్ధం ముగియడం తప్పనిసరి. ఇక్కడ భీష్ముడు చేసినదేమిటయ్యా అంటే తన దేశం కోసం ప్రాణత్యాగం. నిజంగా మనలో భీష్ముడనేవాడుంటే కొంచెంకొంచెంగా బతికి బయటకు వస్తే నిజంగా మన సమాజం, దేశం మరింత బాగుంటాయిగా.
  • అలాగే భీష్ముడి మీద మరిన్ని సందేహాలు. ద్రౌపదీ వస్రాటహపహరణం లోనూ, అతడి ప్రాప్తకాలజ్ఞత మీదా, అంబ, అంబిక, అంబాలికల ఉదంతంలోనూ.
  • ఉదాహరణకి అంబ, అంబిక, అంబాలికల గురించిన వృతాంతం తీసుకుందాం. సత్యవతి భీష్ముడిని అడుగుతుంది. నీ సోదరులిరువురూ మరణించారు. సోదరుని భార్యని నువ్వు వివాహమాడడం సంప్రదాయమే కదా! అలా చేసి భరత వంశాన్ని నిలబెట్టు అని. భీష్ముడంటాడు – నేను మాట ఇచ్చినది నా తండ్రికి, మరియూ నీ తండ్రి దాసరాజుకి. అమ్మగా నీ మాటని గౌరవించాలన్న నిబద్ధత నాలో ఎంతున్నా వారికిచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. వారిద్దరూ లోకంలోనే లేరన్నది వేరే విషయం. నన్ను క్షమించు అంటాడు. అప్పుడు సత్యవతి అంటుంది – నా పుత్రుడు వ్యాసుణ్ణి పిలుచుకురా అంటుంది. ఇక్కడ భీష్ముడు వ్యాసుణ్ణి నియోగించలేదన్నది గమనించాల్సిన విషయం. భీష్ముడు వెళ్ళి సత్యవతి పిలవమన్నాది అని వ్యాసుణ్ణి పిలిస్తే అతడంటాడు – నీ తల్లి గంగ – సత్యవతి నీకు జన్మ నిచ్చిన తల్లిగాదు కాబట్టి ఆవిడ ఆజ్ఞని పాటించాల్సిన ధర్మం నీకు లేదు. కానీ నాకు ఆవిడ జన్మనిచ్చిన తల్లి. ఆవిడ ఆజ్ఞని నేను పాటించే తీరాలి అని బయలుదేరి వస్తాడు. అతడు సన్యాసి. అయినా అమ్మ మాట జవదాటరాదన్నది అతడు చేసిన ధర్మ నిర్దేశం. మనసు పెట్టి చదివితే కనిపిస్తుంది.
  • అలాగే ద్రౌపదీ వస్త్రాహరణం. అయినా ఈ వివరణలన్నీ అనవసరం లెండి. ఎవరో అన్నట్టు జ్ఞాపకం. తెలియని వారికి ఎలాగూ తెలియదు. తెలిసినవారికి ఎలాగూ తెలుసు. ఇంక ఈ వివరణలన్నీ ఎవరికోసం. వాదనకోసమా అని. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మరిన్ని ఉదాహరణలు, వివరణలు మరింత జ్ఞానధనులు ఇచ్చినా, మరి వీటి సంగతి ఏమిటి అని మరిన్ని ప్రశ్నలు వస్తాయి. అంతేకానీ, అందులో సమాధానం ఉంది – మనం తెలుసుకోవాలి అన్న కుతూహలం మాత్రం కలగదు.
  • నేను చెప్పదలుచుకున్నదేమిటంటే మహాభారత రామాయణాలు మన సంస్కృతికి పట్టుగొమ్మలు. అవి మానవజీవన వికాసానికి అనంత సాగరాలు. అందులో ఒడ్డున నిలబడి చిల్లుగవ్వలు ఏరుకునేవారిని ఏమనగలం? పోనీ కొంచెం మధించినతరువాత అందులో హాలాహలం వస్తుంది. ఆ తరువాతకదా అమృతం ఉద్భవించేది? ఇక్కడ అమృతం ఉద్భవించడానికి కొన్ని pre-requisites ఉన్నాయి. మొదటగా మహావిష్ణువు ఇరుసు. (కూర్మావతారం). ఈ ఇరుసు ఏమిటంటే అందులో అమృతం ఉందనే నమ్మకం. అది లేనినాడు మథించడమే సాధ్యం కాదు. మథించినా హాలాహలమే జనిస్తుంది.
  • మనవడా, కాబట్టి ఆ ఇతిహాసాలు నీకు నిజంగా జ్ఞానాన్ని ప్రసాదించగలవు అన్న నమ్మకంతో చదువు. నేను రాజుని, నా దగ్గరకే జ్ఞానం రావాలి అంటే కుదురుతుందా? అది నీకు అర్హత ఉందో లేదో చూసి మరీ వస్తుంది. ఊరికే రాదు. ముందు నీలో హాలాహలాన్ని రేపుతుంది. అయినా నమ్మకం కోల్పోకుండా మథనం సాగించిననాడు నీ హృదయసాగరంలో అమృతం జనిస్తుంది. ఈ క్షణమే ఆ అమృతం నా గొంతులో పడాలి అనేంతగా ఈ దాహం మిమ్మల్నందర్నీ దహించాలని మనసారా కోరుకుంటున్నాను .. కాదు, కాదు, ఆశీర్వదిస్తున్నాను.

చీమ నేర్పిన పాఠం

Thursday, November 13, 2008 8:47
అవీ ఇవీ విభాగంలో ప్రచురించబడినది

నిన్న సాయంత్రం చెప్పుల్లేకుండా గడ్డిలో నడుస్తుంటే కసక్కుమని రాయి గుచ్చుకుంది. ఈ రాయి చేసిన పాపానికి నిష్కృతి లేదు. దీనికి రౌరవాది నరకాలు తప్పవని అనుకుంటూ కిందకి చూసాను. అదే రాయిపై ఒక చీమ హాయిగా పాకురుకుంటూ ఆనందముగా వెళ్ళిపోతోంది. ‘ ఆహా! ఏమి ఈ చీమ చేసిన పుణ్యము – నేను చేసిన పాపమేమి’ అని అనుకుంటూ ఉండగా చేదుగా ఉన్నా ఒక నిజం స్ఫురించింది. నాకు నొప్పి కలిగించింది నా బరువేగాని రాయి కాదు అని.

నిత్యం ఎన్నో సంఘటనలు. కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. కొన్ని బాధని. కొన్ని కోపాన్ని. ఆనందించటం మన జన్మహక్కు అనుకుంటూ – బాధకూ, కోపానికీ ఎదుటివాళ్ళని బాధ్యులని చేసి – వాళ్ళను నాలుగు తిట్టి – అయ్యో దేవుడా! నాకిలాంటి కష్టాలు తెచ్చావయ్యా అని ఎనిమిదిసార్లు ఏడ్చి – సంఘటనతో ఏ సంబంధమూలేని మన సంబంధీకులందరిపై పదహారుసార్లు చికాకుపడి – నేను కాబట్టి ఇంతటితో వదిలేను – ఇలా తట్టుకోగలిగేను – అని ముక్కు చీదుకుంటూ సంతృప్తిని పొందుతాము. కోపం వచ్చింది మనకు. ద్వేషం కలిగింది మనకు. బాధ కలిగింది మనకు. కారణం ఏంటని మనలో మనం ఒక్కసారికూడా తొంగి చూడం. నిజంగా మనం గొప్ప సామాజిక శాస్త్రవేత్తలం.

‘అహం బ్రహ్మస్మి’ , ‘ నాలో విశ్వం – విశ్వంలో నేను’ , ‘The world is not what it is – it is what you are’, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చెప్పే వేదాంత, అధ్యాత్మిక అర్ధాలెలాఉన్నా – అవన్నీ చాటే నిజం ఏమిటంటే ఈ సమాజం ఒక అద్దం. అందులో మన ప్రతిబింబాన్ని మనం చూసుకొని నవ్వుకుంటాం. ఏడుస్తాం. కోపగిస్తాం. ఆ అద్దంలో కనిపిస్తున్నది మనమే అని మర్చిపోయి – ఆ అద్దాన్ని రాతితో కొట్టి పగలగడతాము. సమస్య తీరుతుందా! విరిగిన అద్దం ముక్కలో మళ్ళీ అదే మనం కనిపించగానే షరా మామూలే!

ఎక్కిన కొమ్మను తెగ నరుక్కుని
కాళ్ళల్లో నిప్పులను చల్లుకుని
కంచంలో కత్తులను పెట్టుకుని
మంచంలో మరణాన్ని ఉంచుకుని
క్షణాలతలపై రణాల కిరీటముంచి మురిసినాడే
తోటివాడు తన ప్రతిబింబమ్మని చూడలేని వాడూ
తనని తానె చంపేసుకునేందుకు తయారుగున్నాడూ
దేవుడా ఈ దుష్టుడూ – దెయ్యంకన్నా నికృష్టుడూ
కళ్ళు ఉన్న ఈ అంధుడూ – పాతాళంలో పడుతున్నాడూ!
ఎదిగిన మనిషి ఎదిగాడా – మహామాయలో ఒదిగాడా
ఎందుకులే ఈ అహంకారం – భవితవ్యమంత అంధకారం

నాకూ ఛందపుటీగ కుట్టింది.

Friday, October 24, 2008 19:46
ప్రారంభం విభాగంలో ప్రచురించబడినది

మొన్న భువనవిజయం చూసానా – అప్పటినుంచి ఎలాగోఅలాగ, ఏదో ఒక విషయం మీద ఛందస్సుతో పద్యం రాసేయాలని. ఆశ ఆకాశమంత. శక్తి అణువంత. కానీ ఊహతో పోరాడి తర్కం/నిజం ఎప్పుడు గెలిచింది కనుక? ఎలాగోలా పద్యాలు వ్రాసేద్దామనే నిశ్చయించాను. అనుకుంటే సరిపోతుందా? మనకసలు ఏవీ రాదాయె. చిన్నప్పుడు చదువుకున్న ‘నల్లనివాడు పద్మనయనంబులవాడు’ లాంటివి తక్క – గట్టిగా లెక్కెడితే వందపద్యాలు కూడా రావు. యమాతారాజభానస అని ఏదో సినిమాలో కమల్ హాసన్ అనడంతో గణాలని గుర్తుపెట్టుకునీ – అవి ఎనిమిదే ఎందుకు ఉండాలంటే – రెండిటిని ఉపయోగించి మూడు మాత్రల ప్రస్తారాలు ఎనిమిదేగా వస్తాయి అని లెక్కలపరంగా ఆలోచించడం తప్ప శాస్త్రపరంగా ఆలోచన రానివాడిని. శార్దూలం అంటే గణాలేమిట్రా అని తెలుగుమాస్టారడిగితే, గీతాంజలి సినిమాలో ‘నందికొండవాగుల్లోన’ పాటలో ‘ఓ బాలా మసజసతతగా శార్దూలా’ అన్న వేటూరివారిని గుర్తు తెచ్చుకు సమాధానం చెప్పేవాడిని. ఇలా నా ఛందోపరిజ్ఞానం గురించి ఇంకా మీకు తెలియచేయడానికి చాలా ఉదాహరణలున్నాయి గానీ, మీకు విషయం అర్థం అయిపోయిందని నాకు అర్థం అయిపోయింది.

ఇప్పుడు మీకు డౌటు రావచ్చు – నేను పద్యాలు రాయడం నేర్చుకోవడానికీ, ఈ టపాకీ ఏమిటి సంబంధం అని. ఇక్కడే మీరు పప్పులో కాలేసారు. ఈ మధ్య మీరు బ్లాగ్లోకంలో ట్రెండు ఫాలో కావట్లేదని అర్థం. ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకుంటున్నాము – లేదా ప్రయోగం చేస్తున్నాము అనుకోండి – ఆ విధానం అంతా బ్లాగుల్లో వర్ణించామనుకోండి – మనకి టపాలకి టపాలొచ్చేస్తాయి – ఓరి వెధవా అలా కాదు ఇలా అని పెద్దల అక్షింతలు వచ్చేస్తాయి – ఇలా చేస్తే ఇలాంటి ఇబ్బంది అని మనతోపాటు ప్రయత్నించేవాళ్ళ ప్రశ్నలొస్తాయి – తెలియచేసినందుకు నెనర్లు అని పొగడ్తలొస్తాయి – వెరసి మన బ్లాగుకు హిట్లు . చూసారా ఒక్క దెబ్బకి నాలుగు – క్షమించాలి, ఐదనుకుంటా – పక్షులు. ప్రయత్నం ముదావహం. వివరణ అభినందనీయం. కానీ పద్యం నిరుత్సాహకరంగా ఉంది అనే మగానుభావులు ఉంటారు – కానీ అలాగని మన ప్రయత్నం ఆపలేము కదా! కాబట్టి నా పద్యరచనావ్యాసంగనైపుణ్య సాధనని మొత్తంగా ఇలా బ్లాగులో ఒక సీరియల్ గా మీ ముందు ఉంచుదామని నాకో బ్రిలియెంటు అవిడియా తట్టింది. నా బుర్ర తాలూకు ఎడమవైపు చెవినుంచీ నాలుగు అక్షాంశాల దూరంలో, కంటికి మూడు అక్షాంశాల పైన మీకేమన్నా చిన్న నక్షత్రంలాంటి వెలుగు కనిపిస్తూ ఉంటే – దానర్థం మీకిప్పుడు బోధపడిందనుకుంటాను.

అయ్యా! ఛందస్సులో పద్యం రాయడం అన్నది మన తక్షణ సమస్య. ఇప్పుడు పప్పు చెయ్యడం అన్నది మన తక్షణ సమస్య అనుకోండి – కావాల్సిన సామాన్లూ(పప్పు, టమాటాలు, ఉల్లిపాయలు వగైరా), చేసే విధానం(ఇక్కడ చూడండి), ఉండాల్సిన పరికరాలూ(గిన్నె, స్టవ్, గరిటె వగైరా) – వీటన్నిటితోపాటు పప్పు ఎలాఉంటుంది అన్న విషయం కూడా మనకి తెలియాలని మనవి చేసుకుంటున్నాను అధ్యక్షా! ఇది మీకు చాలా సిల్లీగా, నవ్వులాటగా అనిపించినా పప్పు అనుకుని సాంబారు చేసిన, తినడానికనుకుని తాగడానికి తయారైన వంటకాల్ని వండిన మన నలభీములందరూ నావెంటే ఉన్నారని మీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకా నమ్మట్లేదా – ఇక్కడ చూడండి…

సరే – ఇది కామెడీ టపా అని మీకందరికీ సందేహం వచ్చేస్తోంది కదూ – కాదు – కానే కాదు – ఇలా నవ్వి నన్ను హాస్యరచన వైపు తిప్పేసి నా పద్యరచనావ్యాసంగనైపుణ్యగ్రాహణాభిలాషను (హమ్మయ్య – ఒకసారి ఊపిరి తీసుకుందాం) –పక్కదోవ పట్టిద్దామనే కుట్రకు నేను లొంగను – అసలే నా నిర్ణయం హిమవత్పర్వతమంత స్థిరమైనది – మంచు కరిగిపోతుందని ఎవరా పిల్లికూతలు – ఇలా అనేవాళ్ళని చూసే అల్లా జపాను కప్పల కథ పుట్టింది. తెలిసినివాళ్ళు ముందుకి సాగండి. తెలియని వాళ్ళకోసం చెప్పడం నా విద్యుక్తధర్మం. జపానులో టోక్యోలో అప్పుడే విమానం నుంచి పార్సెల్ దిగింది. తీసుకోవడానికి హొటలు ఉద్యోగి వచ్చాడు. చూస్తే మూత కొంచెం ఊడి ఉంది. నేనిది తీసుకోను అని గొడవ పెట్టాడు. చివరకి విమానం వాడూ, హొటలువాడూ కలిసి ఎయిర్పోర్టు వాడిని న్యాయం చెప్పమని అడగడానికి వెళ్ళారు. ఎయిరుపోర్టువాడు అసలు ఆ పెట్టెలో ఏమున్నాయి – ఏమిటి కథ అని అడిగాడు. హొటలువాడన్నాడు – నేను ఇండియానుంచి మా హొటలువంటకాలకోసం లక్ష కప్పల్ని తెప్పించుకున్నాము. ఇప్పుడు ఆ మూత తెరవబడి ఉంది. అందులో కొన్ని కప్పలు తగ్గిఉంటాయి. ఇప్పుడు అవన్నీ లెక్కకట్టే సమయం లేదు. కాబట్టి నేను ఈ పెట్టె తీసుకోను. ఓయీ విమానచోదకా నీ వాదన వినిపించు అన్నాడు ఎయిరుపోర్టువాడు. ఆ కప్పలు హైద్రాబాదులో ఎక్కించామండి – అవి ఆంధ్రాకప్పలు అని అన్నాడు విమానంవాడు. వెంటనే ఎయిరుపోర్టువాడు కావాలంటే నేను నీకు హామీపత్రం ఇస్తాను – అందులో ఒక్క కప్ప కూడా తగ్గదు – ఒక కప్ప పొరపాటున పైకి దూకబోయినా మిగతా అన్నీ కిందకి లాగేస్తాయి – సందేహము వలదు అని గీతోపదేశం చేసి కప్పలడబ్బాని హొటలువాడికి ఇచ్చాడుట.

ఇంతకీ మహాజనులారా! నేను చెప్పదలుచుకున్నదేమిటంటే – పద్యరచనాకౌశలం నేర్వాలన్న మదీయాభిలాషాగ్నికి తగిలించి తమాషా చూసే గురువర్యులు కొందరు ఆజ్యం పోయడం వలన అది కొంచెం సా………. గుతున్నట్టే ఉన్నాది. ఈ విషయమై నేనేమిచేసాను – ఎలా మొదలెట్టాను – ఎక్కడిదాకా వచ్చాను – అన్న విషయాల్ని మీతో పంచుకోవడంతోపాటు వండిన పప్పుని కూడా మీఅందరికీ రుచిచూపించి మీరింకా బానే ఉంటే అప్పుడు నేను తిందామని నిశ్చయించుకుని – ఇలా ప్రారంభిస్తున్నాను.

ప్రయత్నం

Friday, October 10, 2008 14:35
కవితలు విభాగంలో ప్రచురించబడినది

ఇంకేమి చెయ్యాలో నాకు తెలియటం లేదు.
ఈ రాయికి సంగీతం నేర్పించాలంటే ఇంకేమి చెయ్యాలో..
ముందుగా నీలపు నింగిని చూపించా – ఆ మౌనగీతాన్ని వినమని
గాలి వేగాన్ని – అందులోని భావగీతాన్నీ వినిపించా
వర్షమేఘాల హర్షరాగాన్ని వినిపించా – వాద్యమయ్యే ఆ ఘోషనీ వినిపించా
నేలను తాకిన నీరు జలపాతంగా ఎదిగే హోరుని వినిపించా
అల్లరి జలపాత కన్నియ పారే ప్రౌఢనదిగా మారిన మంద్రాన్ని వినిపించా
నది మందగమనంతో పుడమి తల్లిని కలసి చెప్పిన ఊసులను వినిపించా
పైరుపైటేసి పుడమితల్లి పాడిన సంక్రాంతి పదగతులను వినిపించా
నది తన నాధుని కౌగిలిలో సిగ్గుతో చేస్తున్న గాజుల గలగలను వినిపించా
ఆ కడలి ఆలపించేటి ఆ తరంగాల అంతరంగాన్ని ఆవిష్కరించా…
ఇంకేమి చెయ్యాలా అని నిస్పృహగా బుర్ర పైకెత్తితే మళ్ళీ నీలపు నింగి.
ఏమి చెయ్యాలో నాకేమీ తెలియటం లేదు.
ఇంతలో వెన్నుతట్టి ఎవరో పిలిచారు. ఎవరా అని చూస్తే అతడే…
అప్పటినుంచీ చూస్తునే ఉన్నాడనుకుంటా… నా పాట్లన్నీ…
ఒకసారిమ్మని ఆ రాతిని తీసుకున్నాడు.
తన ఎదకి హత్తుకున్నాడు.
ఎదసడిని వినిపిస్తున్నాడో ఏమో!
నా చెవిని వినమంటూ రాతికి దగ్గరగా పెట్టాడు.
నెమ్మదిగా రాతిని రెండవ పక్క మీటసాగాడు.
చెవిలో ప్రతిధ్వనిస్తున్న సంగీతం – ఎదంతా నిండిపోతోంది.
ఆనందం గుండెల్లో ఇమడలేక కన్నీటిగా పొంగుకొస్తోంది.

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?

Wednesday, October 8, 2008 0:25
సినీ గీతాలు విభాగంలో ప్రచురించబడినది

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?
ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా?

చిన్నప్పుడు పాటలు వినే కొత్తలో శ్రీశ్రీ రచించిన పాడవోయి భారతీయుడా అనే పాట చాలా గొప్పపాట అని అమ్మ వినిపించేది. పాట వచ్చి ముప్పయ్యేళ్ళు గడిచినా చూడు ఇప్పటికీ ఆ పాట ఎంత రెలవెంటుగా ఉందో అని చెప్పేది. అప్పటిలో శ్రీశ్రీ దార్శనికత మీద గొప్ప అభిమానం పెంచేసుకున్నా కూడాను. కొన్నాళ్ళ తర్వాత అర్థమయ్యింది – రాయడంలో శ్రీశ్రీ గొప్పతనం ఎంతలా ఉన్నా – ఆ పాటని నిజం చెయ్యడంలో సమాజం “గొప్పతనాన్ని” కూడా తక్కువ అంచనా వేయకూడదని. సిందూరం అనే సినిమాలో వ్రాయబడ్డ ఈ పాటగురించి కూడా పై అభిప్రాయం వర్తిస్తుందనుకుంటాను. ఈ పాట పదేళ్ళక్రితం యాభయ్యవ స్వాతంత్ర సంబరాల సమయంలో అనుకుంటా వ్రాయబడింది. నిన్నే ఎందుకో హమ్ముకుంటుంటే – ఆహా! అయితే మనం గత పదేళ్ళలో పెద్దగా ఒరగబెట్టేసినదేమీ లేదన్నమాట అనిపించింది. పాట వింటూ అనిపించిన కొన్ని అనుభూతుల్ని మీతో పంచుకుందామని…

శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చినబహుమానం – ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా – ఓ పవిత్ర భారతమా!

అవ్వడానికి సింధూరమే – పవిత్రమే – తెచ్చినదే ఎక్కడనుండి – కపోతాన్ని – అదే శాంతికపోతపు రక్తంతో భరతమాతకి సింధూరం దిద్దుతున్న సమాజం గత యాభయ్యేళ్ళలో అస్సలు మారలేదు. నాటి దేశవిభజన గొడవలనుండి – నేటి ఒరిస్సా మారణహోమాల దాకా – ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం – కృష్ణగీత ఆపిందా నిత్యకురుక్షేత్రం – మారదు లోకం – మారదు లోకం.

కులాలకోసం గుంపులు కడుతూ మతాలకోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే – జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం- తెలిసీ భుజంకలిపి రారేం
అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి – పోరి ఏవిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం – ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా – ఓ అనాధ భారతమా!

ఒకవంక కులాల కురుక్షేత్రం. మరొకవంక మతాల మారణహోమం. పోనీ ఇవన్నీ అలా జరిగిపోతున్నాయా – కాదే – జరిపింపబడుతున్నాయి. ఎందుకు అని తెలిసినవాళ్ళంతా బానే ఉన్నారు. తెలియని మూర్ఖజనాలు బలవుతున్నారు. ఆపగలిగిన మేధావివర్గం దేశం అనే భావనే టెర్రరిజానికి మూలం – కాబట్టి దేశభక్తన్న భావనే పోవాలి అంటుంది. స్వేఛ్చ దేనికయ్యా అంటే కొట్టుకోవడానికి – ఎవరు ఎవరికోసం ఎవరితో కొట్టుకుంటున్నారు – ఎందుకోసం కొట్టుకుంటున్నారు – నూరుకోట్లమంది నీ నీడలో, నీ తిండి తింటూ, ఆనందంగా కొట్టుకుంటూ స్వేఛ్చని అనుభవిస్తున్నారు. నువ్వుమాత్రం అనాధవే… అమ్మ తుఝే సలాం.

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
క్రూరమృగంలా కారడువుల్లో దాక్కుని ఉండాలా – వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం – శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతివీరులనణిచే విధిలో కవాతు చెయ్యాలా – అన్నలచేతిలో చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి – తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ సమరం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం
చీకటివైపా వేకువలోకా ఎటు నడిపేనమ్మా – గతి తోచని భారతమా

ధైర్యమూ, ధర్మమూ రెండూ సమాజంలో ఉంటే ఆ సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఆ రెంటినీ సమాజం పంచేసింది. ఒకభాగం అడవిలో నక్సలైట్లకిచ్చి, మరోభాగం పోలీసులకిచ్చి ఆ కలహాన్ని చూస్తూ సంఘం శిలలా చూస్తూ ఉంటే… సమాజంలో జీవం ఎక్కడుంది? అలాంటి జీవంలేని శవాల్లా సమాజంలో నడుస్తున్న మేధోజనాలం మనం. మన సిగలో నెత్తుటి మందారాన్ని తురుముతున్న ఈ సింధూరసంధ్య ఎటు తీసుకుపోతుందో? ఈ సంధ్య ఉదయసంధ్యో, సాయంసంధ్యో అర్థం కావడం లేదు. మనందరికీ ఒకటే తృప్తి. సాయం సంధ్య అయినా రాత్రంతా గడిచైనా రేపుదయం వస్తుందని. మనకేమన్నా తొందరా? మనం నడిచి వెళ్ళాలంటే సమస్య – మనం నడవనంతవరకూ ఎవరెక్కడికి పట్టుకెళ్ళినా మనకి పరవాలేదు. వీలైతే స్పందించడమే మానేద్దాం. లేదంటే నక్సలైట్లదే తప్పని కాస్త అరుద్దాం. కాదంటే పోలీసులదే తప్పని గోలచేద్దాం. లేదంటే హిందూమతానిదే పాపం అని ప్రశ్నిద్దాం. పోదంటే ముస్లిములే తీవ్రవాదులని నిర్ణయిద్దాం. మరింత ఆజ్యాన్ని రగిలిద్దాం. ఆ చితిమంటల వెలుగులో మనం చలికాచుకుందాం.
అంతేనా…

తనతలరాతను తనే మార్చగల అవకాశాన్నే వదలుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకుని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితిమంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాలభారతమా ఓ విషాద భారతమా!

అస్సలు ఈ పాటకి మీకు మధ్య నేనుండాలా అనిపిస్తుంది. కళ్ళున్న జాతిని కళ్ళు తెరవమని చెప్పడానికి అటు ఆవేశానికీ, ఇటు అధికారానికీ తీరుబడిలేదు గానీ, నడిపించడానికి మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఈ కురుక్షేత్రానికి అతిముఖ్యలోపం గమ్యం లేకపోవడం – గమ్యం తెలియకపోవడం. ఈ చితిమంటల సింధూరం చూస్తూ కూడా నిదురిస్తావా అని భారతానికొక ప్రశ్న.

భారతమంటే నేను కాదు అని అనేసుకుని పక్కకు వెళ్ళిపోకండేం!