ఆదిభిక్షువు వాడినేది కోరేది
Thursday, October 2, 2008 0:53ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన మొదటి సినిమాలోదీ పాట. బాగు ప్రాచుర్యం పొందిన పాట. పండితులసంగతి తెలియదు గానీ, నాబోటి పామరులకు బాగా నచ్చిన పాట. నిందాస్తుతి శిల్పంలో వ్రాయబడ్డ పాట. నిందాస్తుతి అన్నది ఎప్పటినుంచో ఉన్న సాహితీప్రక్రియే. సినిమాపాటల్లో కూడా నిందాస్తుతితో ఉన్న కొన్ని పాటలున్నట్టే గుర్తు. ఇంతకీ సినిమాలో ఈ పాటలో మూడు చరణాలుంటాయి. కానీ, అసలు ఆయన వ్రాసినదానిలో ఇంకా చాలా చరణాలున్నాయి. అన్నిటినీ మీముందుంచాలని ఈ ప్రయత్నం.
తేనెలొలికేటి పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
తీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకుగర్జనల మేఘముల మేనికి మెరపు హంగు కూర్చినవాడినేది అడిగేది
పగటి వెలుగును వేడితోటి రగిలించి పనికి ఫలితమ్ముగా చెమట చిందించి…
నిదురించు నిశిలోన శశికాంతులెంచి చల్లదనమును కల్ల కలలుగా నిలపిన…
ముల్లోకముల జ్ఞానజ్యోతిని వెలిగించగల మూడవ దృగింద్రియమును మూసిఉంచినవాడు
తడబాటుతో తడములాటతో వెతుకుటకు దారిచూపగలేని రెండుకళ్ళిచ్చాడు
కారుణ్యచంద్రికల కురిసేటి జాబిలికి కాలుష్యమొసగిన ఆ కళాధరుడు
పురివిప్పి ఆడేటి నెమలిగాత్రమ్మునకు కావుకేకల కవిత కూర్చేటి కవివరుడు
మిన్నేటి ప్రళయమను ప్రణయమనుకున్నాడు
బడితపూజకు మెచ్చి పాశుపతమిచ్చాడు
తికమకలుగా జగతి గతి నడుపుతున్నాడు
అసలు సంగతి మదికి అందనీకున్నాడు
గిరిబాలతో తనకు కళ్యాణమొనరించ దరిచేరు మన్మధుని మసి చేసినాడు
వరగర్వమున మూడులోకాల పీడించ తలపోయు దనుజులను కరుణించినాడు
ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు
ముక్కంటి – ముక్కోపి – తిక్కశంకరుడు
పాటలో ప్రతీ చరణానికీ, కవికీ మీకూ మధ్య నేనేమీ నిలవనక్కరలేదు. అన్నీ ఎవరికివారు అనుభవించి తెలుసుకునేవే. నిందాస్తుతిలో అవకాశం దొరికిందికదా అని దేముడిని తిట్టడం కాదు. అందులో పైకి నిందగా కనిపిస్తూనే, భగవంతుని గుణవిశేషాలను కీర్తించాలి. అందుకే దానిని నిందాస్తుతి అన్నారు.
ఎందుకో పాట అంతా మనకేమి కావాలో మనకంటా శివయ్యకే తెలుసు అనిపిస్తూ ఉంటుంది. ఏమి జరిగినా మన మంచికే అన్న సామెత మీరు వినే ఉంటారు. కానీ, దానిని ఒప్పుకోవడం కష్టం. అందులోనూ నమ్మి ఆచరించడం మరీ కష్టం. ఆ సామెతని ఒప్పుకోవడంలో సమస్య ఏమిటంటే టైంఫ్రేం. మనం చూసే టైంఫ్రేంలో చెడ్డగా కనిపించే చాలా విషయాలు, కొంచెం టైంఫ్రేముని విస్తరించగానే, అవి చేసే మంచి కనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ. మనం ఇంజక్షను తీసుకోవడం అన్న సంఘటన తీసుకుందాం. మన టైంఫ్రేం కొన్ని సెకన్లు అనుకుందాం. అప్పుడు ఇంజక్షను మనకి ఇచ్చే నొప్పే/చేసే చెడ్డే కనిపిస్తుంది. అదే కొంచెం ఆ టైంఫ్రేముని విస్తరిస్తే, అది మనకు చేసే మంచి కనిపిస్తుంది. ఆరకంగా ఈ పాట నాకు ఎంతో వ్యక్తిగతంగా మార్గదర్శనం చేసింది.
ఈ పాట సినిమాకోసం వ్రాసినపాటకాదు. బెంగుళూరులో నంది హిల్సులో సిరివెన్నెల షూటింగు జరుగుతున్నప్పుడు శాస్త్రిగారు షూటింగుతో పాటు అక్కడే ఉండి పాటలకు మార్పులూ, చేర్పులూ చెయ్యడం గట్రా చేస్తున్నారట. ఆయన పనేమిటంటే, రోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖాళీ, సాయంత్రం షూటింగు ముగిసాక విశ్వనాధ్, మహదేవన్, ఎస్. పి. బి మొత్తం అందరూ కూర్చుని ఉంటే ఒక రెండు గంటలు తన పాటలు పాడడం. ఒకరోజు ఉదయం షూటింగుకి అందరూ వెళ్ళిపోయాక, నందికొండలలోని శివాలయంలో కూర్చుని శివయ్యని చూస్తూ ఉండగా పాట పొంగుకొచ్చిందట. ఆ రాత్రి పాటలలో ఈ పాటను పాడితే విశ్వనాథ్ వెంటనే ఈ పాట నాకెలాగైనా సినిమాలో కావాలని అప్పుడు స్క్రిప్టుని మార్పించి పాటని పెట్టారంట. ఇంతకీ, ఇదొక్కటే కాదు, సిరివెన్నెలలో సుమారు అన్నిపాటలకీ, సిరివెన్నెల పాట వ్రాసుకుంటున్నప్పుడు కట్టుకున్న బాణీలనే ఉపయోగించారు.
చాలా ఆలోచించిన మీదట, ఈ సాహసం చేస్తున్నాను. ఈ పాటని శాస్త్రిగారి బాణీలో, నా గొంతులో వినండి. నాకు తెలుసు, ఇది మీకు చాల విషమ పరీక్షేనని. నేనింత క్రూరమైన పని చెయ్యడానికి, నాకున్న నిస్సహాయతే కారణం. పాట మీరు వింటే బాగుణ్ణు అని ఆశ, మామూలుగా మీరు సినిమా పాట వింటే మీకు దొరికేవి మూడు చరణాలే. అందుకని… ఏమి చెయ్యాలో తెలియక, ఏమీ చెయ్యకుండా ఉండలేక – మన కొత్తపాళీ, రానారె, సత్యసాయి గార్లని తలచుకుంటూ, ఇలాంటి దుస్సాహసం చెయ్యవలసి వచ్చింది. ఇందుకు నన్ను క్షమిస్తారని ఆశిస్తూ…
భవదీయుడు
కృష్ణమోహన్
Purnima
October 2nd, 2008 1:02 am కు
మాస్టారూ.. మిమల్ని “మాస్టారు” అని పిలిచుకునేదిందుకే! ఇంత మంచి సాహిత్యాన్ని పూర్తిగా పంచుకోవడమే కాక, మాకు వినిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
వీరతాళ్ళు నాకిప్పటివరకూ వచ్చినవి రెండే (మీరు వేసినవే) ఉన్న రెండూ మీకే ఇచ్చేస్తున్నాను.
ఇలాంటివే మరిన్ని పాటలు పరిచయం చేయగలరని ఆశిస్తూ
అభినందనలతో,
అని అన్నారుపూర్ణిమ
కొత్తపాళీ
October 2nd, 2008 1:30 am కు
Bravo!
Welcome to the club.
ధైర్యే సాహసే వెంకట సుబ్బలక్ష్మీ అని ధైర్యం చేసి అడుగు ముందు కేశారు కాబట్టి, కాస్త శ్రమ అనుకోకుండా, అప్పుడప్పుడూ గొంతు చేసుకుంటూ ఉండండి!
అని అన్నారునాగమురళి
October 2nd, 2008 1:44 am కు
వావ్!! బాగుందండీ. అసలీ పాటలో ఇన్ని చరణాలు ఉన్నాయని నాకు తెలియదు. Very happy to know the full song.
చాలా బాగా పాడారండీ. Well done. మీకు సీతారామశాస్త్రి గారితో వ్యక్తిగత పరిచయం ఉందా?
అని అన్నారుభవాని
October 2nd, 2008 3:14 am కు
మీ వల్ల నిందాస్తుతి అంటే తెలిసింది.
అని అన్నారుచాలా మంచి పాట.
ఇంక మీరు పాడడానికొస్తే – మంచి ప్రయత్నం
teresa
October 2nd, 2008 4:06 am కు
బావుంది
అని అన్నారుnarasimha rao mallina
October 2nd, 2008 5:16 am కు
బాగా పాడారు.పాడుతూ ఉండండి.
అని అన్నారుసుజాత
October 2nd, 2008 5:23 am కు
ఎంత ఆశ్చర్యమో ఉందో, చెప్పలేను. ఈ పాట గురించి ఎవరన్నా రాస్తే బాగుండు అని నిన్ననే అనుకున్నాను. మీరు రాస్తారేమో అని అనుమానించాను. కాదు…ఊహించాను కూడా ఎందుకో! ఇవాళ పొద్దున్నే శివదర్శనం!
మళ్ళీ తీరిగ్గా చదువుతాను. మళ్ళీ విని మళ్ళీ రాస్తాను.
సీతారామ శాస్త్రి ఎన్ని పాటలు రాసినా, ఈ ఒక్క పాట కోసం కోటి సార్లు పాదాభివందనం చేయాలన్నంత ప్రేమ వచ్చేస్తుంది విన్నప్పుడు. ఇంత బాగా మహాదేవుడిని అర్థం చేసుకున్న కవి గారు ఈయనేనేమో!
అని అన్నారునరహరి
October 2nd, 2008 5:56 am కు
http://surasa.net/music/telugu-kavita/#sirivennela_viza
sirivennela gaari gontu lo ikkada vinandi……….
అని అన్నారునరహరి
October 2nd, 2008 5:57 am కు
http://surasa.net/music/telugu-kavita/#sirivennela_vizag
అని అన్నారుచైతన్య
October 2nd, 2008 10:07 am కు
బాగా రాశారు. మంచి టపా. ఆ పాట గురించి తెలియని విషయాలు ఎన్నో తెలియచేసారు. థాంకులు.
అని అన్నారుసిరిసిమువ్వ
October 2nd, 2008 10:59 am కు
బాగా పాడారు. ఇంకొన్ని మంచి పాటలు ఇలానే వినిపిస్తుండండి.
ముక్కంటి – ముక్కోపి – తిక్కశంకరుడు —– ఈ మాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.
@కొత్తపాళీ గారు, స్ఫూర్తి ప్రధాతలు, మీ గొంతు మళ్లెప్పుడు వినిపించబోతున్నారు!!
అని అన్నారుకొత్తపాళీ
October 2nd, 2008 5:09 pm కు
సుజాత గారు అతిశయోక్తికన్నా అతీతమైన మాట సెలవిచ్చారు పైన. మన ఆర్య ఋషులు దర్శించి కీర్తించిన వైదికమైన రుద్ర ప్రశ్నం దగ్గిర్నించీ, నాయన్మారుల ద్రావిడ వేదాల మీదుగా, మన తెలుగులోనే పాల్కురికి సోమన్న, శ్రీనాథ కవి సార్వభౌముడు, స్తుతమతి యైన యంధ్ర కవి ధూర్జటి ప్రభృతులు శివతత్త్వాన్ని పలు రూపాల్లో మహాద్భుతంగా గానం చేశారు. సీతారామశాస్త్రి పాటలో చమత్కారం ఉంది. భగవంతుడితో ఒక భక్తుడికి మాత్రమే ఉండే చనువుంది, ఆ చనువు వెనకనే తొంగి చూసి మనకి కితకితలు పెట్టే కొంటెతనముంది. అన్నీ మెచ్చదగిన విషయాలే .. అంత మట్టుకూ నిజం.
అని అన్నారుసిసిము గారూ, ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానండి. త్వరలో తప్పక వెలువరిస్తాను.
రానారె
October 3rd, 2008 11:55 am కు
కృష్ణమోహన్ గారూ, ఈ పాటకే మీరు ఇంకో చరణం జతచేయగలరేమో చూడండి. ఈ పాటకు ఇన్ని చరణాలున్నాయని తెలీదు. పాడి, బ్రాడుకాస్టిన మీ ధైర్యానికి అభినందనలు. మీరు చేసే వ్యాఖ్యానాలు బాగుంటాయి. వాటినీ వినిపిస్తూవుండండి.
అని అన్నారుChivukula Krishnamohan
October 3rd, 2008 5:25 pm కు
@రానారె – మీరడిగాక కాదంటానా? ఇదిగో నా జోడింపులు – ఆ స్థాయిలో ఉండవనుకోండి.
హరికేను రూపాన భీభత్సమొనరించి లీలచూచేటివాడినేది కోరేది
అని అన్నారుజగమంత కోరేటి గంగమ్మ అమ్మను జటాజూటమున నిలపి మురిసేటివాడినేది అడిగేది
సత్యాన్ని సులభంగా చేరేటి భక్తి మరపినవాడినేది కోరేది
వానరమస్తిష్కమునకు నారికేళతర్కమిచ్చినవాడినేది అడిగేది
అమ్మమాటవిని అడ్డుగనిలచిన తనయుని తలనుత్తరించినవాడినేది కోరేది
అమ్మనాలిగనెంచి అప్పగించమను రావణుని ఆశీర్వదించినవాడినేది అడిగేది
మీరు చెప్పినది నాకర్థమయ్యింది. ఏవో వ్యాఖ్యానాలు రాసుకోక ఎందుకీ దుస్సాహసాలని. ఈసారే చాలా ధైర్యం చేసా. ఇకమీదట ….
@ పూర్ణిమ – మీఊరిలో పోస్టుమేను ని కూడా మాస్టారంటారా?
@కొత్తపాళీ – ఏదో అలా జరిగిపోయింది ఘోరం. మళ్ళీ చెయ్యమని ముక్తాయింపొకటా? అయినా కక్ష తీర్చుకునే మార్గాలు మీకు వేరేవి లేవా? మొదట పాడినందుకు – ఇప్పుడు ఈ వెంకట సుబ్బలక్ష్మి ఎవరని – ఇంట్లో నా పరిస్థితి దయనీయంగా ఉంది. చిన్నమాట – సుజాతగారు సినిమాపాటలు అన్న డొమైన్ లో మాట్లాడారనుకుంటా.
@నాగమురళి- సీతారామశాస్త్రి నాకు తెలియకపోవటమేమిటండీ – బ్రహ్మాండంగా తెలుసు. ఆయనకే – నేను తెలియదు.
@భవాని, తెరెసా, నరసింహారావు, సుజాత, చైతన్య,సిరిసిరిమువ్వ,నరహరి – ధన్యవాదములు.
Purnima
October 3rd, 2008 9:48 pm కు
వాహ్.. వాహ్! మీరు జతపరచిన లైన్ల కి, ముఖ్యంగా ఆఖరి దానికి.
మా ఊరిలో ఎవరిని ఏమన్నా మనస్పూర్తిగా అంటారు. మాది “దిల్” భాష లెండి!
అని అన్నారుకొత్తపాళీ
October 6th, 2008 5:51 pm కు
“అమ్మమాటవిని అడ్డుగనిలచిన తనయుని తలనుత్తరించినవాడినేది కోరేది
అని అన్నారుఅమ్మనాలిగనెంచి అప్పగించమను రావణుని ఆశీర్వదించినవాడినేది అడిగేది”
These capture the tongue-in-cheek spirit of the original. the others not quite. good show.
@Purnima .. ha ha ha
ramani
October 7th, 2008 9:24 pm కు
“సీతారామశాస్త్రి నాకు తెలియకపోవటమేమిటండీ – బ్రహ్మాండంగా తెలుసు. ఆయనకే – నేను తెలియదు.”
జోక్ చాలా బాగుంది. పాట కూడా జోకంత బాగుంది.
అని అన్నారువేణూ శ్రీకాంత్
October 7th, 2008 10:40 pm కు
కృష్ణ మోహన్ గారు చాలా బాగా పాడారండి. నాకు కూడా ఇది చాలా ఇష్టమైన పాట కానీ దీనిలో ఇన్ని చరణాలున్నాయని తెలీదు. మీ జోడింపు కూడా బావుంది. ఇంత చక్కని పాటని పూర్తి గా ఇక్కడ పంచుకున్నందుకు నెనర్లు.
అని అన్నారుసుజాత
October 12th, 2008 7:56 pm కు
కృష్ణ మోహన్ గారు,
మీరన్న మాట కరక్టే, ‘సినిమా పాటలు ‘ అన్న డొమైన్ లోనే మాట్లాడాను. ‘అర్థం చేసుకున్న సినిమా కవి ‘ అని రాస్తే బాగుండేదేమో నేను.
అని అన్నారుpappu
October 26th, 2008 12:53 pm కు
తిరిపెమున కిద్దరాండ్రా…పరమేశా గంగ విడుము పార్వతి చాలున్..(ముస్టెత్తుకునే వాడివి నీకెందుకు ఇద్దరు పెళ్ళాలు..గంగమ్మని వదులు అని…)
అని మహాకవి శ్రీనాధుని వ్యాఖ్య..అప్పుడెప్పుడో రాయలసీమలో నీళ్ళు లేక కట కట లాడుతుంటే…అందుకే భోళా శంకరుడు అన్నారు…
ఎలా పిలిచినా పలుకుతాడు..
అని అన్నారురామేశబాబు
April 3rd, 2009 6:53 pm కు
బహు బాగుంది సారు
మీదు పాటల జోరు
నేనే ఇలా రాసేసానంటే మీ రాతల మహత్యం అమోఘం, మరీ ఎక్కువగా పొగిడేస్తున్నాననుకోకపోతే, అద్భుతం. మీ టపా చదవటం ఇదే మొదటిది అనుకోకుండా కలిగిన అదృష్టం.
అని అన్నారుచాలా సంతోషం!
Phanindra
September 21st, 2009 5:48 pm కు
చాలా చక్కగా ఉంది..మీ అంత బాగా నేను ఒకనాటికి రాయగలనని ఆశిస్తాను. స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు!
అని అన్నారు