జగమంత కుటుంబం నాది…
Saturday, August 9, 2008 18:05జగమంత కుటుంబం నాది – ఏకాకి జీవనం నాది
సంసారసాగరం నాదే – సన్యాసం, శూన్యం నావే
పాట మొదటి లైను వినగానే ఇది ఏదో “వసుధైక కుటుంబకమ్” కి సంబంధించిన పాట అనిపిస్తుంది. అయితే అలాంటి ఆలోచన మనకు పాటలోని సంపూర్ణార్ధాన్ని అందివ్వదు. రవి, కవి మార్గాన్ని చూపించేవాళ్ళు. వారిద్దరిమధ్య సామ్యాన్ని చూపిస్తూ వ్రాసిన కవితలు చాలా ఉన్నాయి. కాకపోతే రవి గాని, కవి గాని, ప్రధమపురుషలో తమ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, వారి మధ్య సామ్యాన్ని పాఠకులు తమంతటతాము అన్వయించుకునేటట్లు రాసిన ఒక ప్రయోగం ఈ పాట. పాటమొత్తాన్ని రవి పరంగాగాని, కవి పరంగాగాని అర్ధం చెప్పుకోవచ్చు. ఆ అర్ధాల సామ్యాన్ని బట్టి రవికి కవికి మధ్య సారూప్యతను ఆవిష్కరించుకోవడం పాఠకుడికి ఒక అభ్యాసం.
అంతా నాదే అంటూ, నేను ఏకాకిని అనడం విరుద్ధభావాలను వ్యక్తం చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏకాకితనం పూర్ణత్వాన్ని (completeness) ని సూచిస్తుంది.
కవినై, కవితనై
భార్యనై, భర్తనై
అందెల రవమిది పదములదా అనే టపాలో భిన్నత్వంనుండి ఏకత్వం వైపు సాధకుని ప్రయాణం అంటూ ద్వైతాద్వైతాలగురించి వ్రాసాను. అక్కడ ద్వైతం అనుభవించడం సులభసాధ్యమే అని వ్రాస్తూ కర్త-క్రియ అంటూ కొన్ని ఉదాహరణలిచ్చాను. చివరికి ఆ రెండూ ఏకత్వాన్ని పొందుతాయని వ్రాసాను. ఇక్కడకూడా అలాంటి ధోరణి కనిపిస్తుంది.
మల్లెలదారిలో, మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
రవి పరంగా అర్ధం చెప్పుకుంటున్నప్పుడు మల్లెలు విరిసే గ్రీష్మం – సూర్యుని తేజం కనపడని మంచుఎడారి అంటూనే / కవిపరంగా అర్ధం చెప్పుకుంటున్నప్పుడు పాఠకుల అబినందన మల్లెల దారి – ఎవరూ లేని మంచు ఎడారి అని అర్ధాలు స్ఫురిస్తూనే వారిద్దరి సామ్యం ఆవిష్కృతం కావడం ఒక మంచి ప్రయోగం.
మల్లెలదారిలో పన్నీటి జయగీతాలు, మంచుఎడారిలో కన్నీటి జలపాతాలు అన్నప్పుడు రవి / కవి ల భావావేశంతో పాటు నాకనిపించిన మరొక అర్ధం ఏమిటంటే – సూర్యుడి నుంచి ప్రతి మనిషి – కనీసం కవి తప్పకుండా నేర్చుకోవలసిన విషయం – బాధ్యతను నిర్వర్తించే విధానం. మల్లెలదారిలోగాని, మంచుఎడారిలోగాని, పన్నీటి జయగీతాలలోగాని, కన్నీటి జలపాతాలలోగాని, సూర్యుని నిష్కామ, నిష్పాక్షిక కర్మయోగం. కుల, మత, జాతి, వర్ణ, వర్గ, పాప, పుణ్య రహితంగా సర్వ మానవాళికి తన వెలుగును ఒకేలా అందిస్తున్న సూర్యుని కర్మానుష్ఠానము అమోఘం, అభినందనీయం, ఆచరణీయం.
ఈ విశ్వం ఇంకా విస్తరిస్తున్నదనీ, కొత్త సూర్యమండలాలు ఇంకా ఆవిష్కరింపబడుతున్నాయనీ, వాటికింకా అనేక సూర్యుల అవసరం ఉందనీ, బాధ్యతలు నిష్కామంగా, నిష్పాక్షికంగా నిర్వర్తించినవారు సూర్యునిగానో, చంద్రునిగానో మారుతారనీ – ఏంటో పిచ్చి ఆలోచనలు.
నాతో నేనే అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ,
ఒంటరినై అనవరతం, కంటున్నాను నిరంతరం
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని
తనతో తాను, తనలో తాను నిరంతరం ఘర్షిస్తూ, రమిస్తూ జరిపిన హాలాహలమధనాన్నుండి జనించిన కావ్య లక్ష్ములను నారాయణుడిగా మనలను భావిస్తూ మనకి కవి అప్పగిస్తున్నాడు.
మింటికి కంటిని నేనై, కంటల మంటను నేనై,
మంటలమాటున వెన్నెల నేనై, వెన్నెలపూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిశినై
చూసేది కన్ను కాదు. కంటివెనకవున్న ప్రాణతేజం. ఆ కంటికి సకలము చూపించే వెలుగు కిరణాల లావణ్యను మనకు అందించినది రవి. అలాగే చూసే సంఘటన ఒకటే అయినా స్పందించే తీరు వేరు. ఆ స్పందనని మనలో కలిగించిన భావాల కన్యల్ని మనకు కన్యాదానం చేసిన మామగారు కవి. ఉద్రేకాల్నీ, ఉద్వేగాల్నీ మనలో కలిగించే తండ్రిలాంటి సూర్యుని ఉడుకుతనానికిగాని, సాంత్వనను అందించే చంద్రుని చల్లదనానికి గాని, రెండిటికీ ఆధారం ఒకటే అని మర్చిపోకండి.
నాతో నేనే సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ,
ఒంటరినై అనవరతం, కంటున్నాను నిరంతరం
కిరణాల్ని, కిరణాల హరిణాల్ని, హరిణాల చరణాల్ని, చరణాల చలనాల గమ్యాన్ని, కాలాన్ని, ఇంద్రజాలాన్ని
ఇక్కడ కిరణాలు, కిరణాలనే లేళ్ళు, లేళ్ళ కాళ్ళు, కాళ్ళ కదలికలు, వాటి గమ్యాలు, వీటిని సృష్టించిన కాలం అనే ఇంద్రజాలం అని సూర్యుడిపరంగా చెప్పుకుంటూ ఉండగానే,
కవితలు, కవితల భావాలు, భావాల ఆలోచనలు, ఆలోచనల నడతలు, వాటి లక్ష్యాలు, వీటిని సృష్టించిన కాలం అనే ఇంద్రజాలం అంటూ కవి పరంగా అర్ధం స్ఫురిస్తుంది.
గాలి పల్లకిలోన తరలి నా పాటపాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి మూగవోయి నా గుండె మిగలె
నా హృదయమే నా లోగిలి – నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి – నా హృదయములో ఇది సినీ వాలి
నా హృదయంతో నేను రమించినప్పుడు జనించే కవితల/కిరణాల వెలుగును గాలి పల్లకిలో మీకందించిన తరువాత నాలో కలిగే ఒంటరితనం వెలుగునెరగని అమావాస్య అంటూ కవి/రవి తమలోని ఒంటరితనాన్ని అభివ్యక్తీకరిస్తున్నారు.
కవి తన భావకన్యల్ని మనకందించడంతో ఆయన బాధ్యత పూర్తవుతుంది. మన ఇంటికొచ్చిన ఆ అందమైన ఆడపిల్లల్ని నరకాసురుడిలాగ చూసుకుంటామా లేక కృష్ణుడిలా చూసుకుంటామా అనేది మనపై ఆధారపడివుంది.
శాస్త్రిగారన్నట్టు అర్ధం చెప్పటం అన్నమాట అర్ధంలేనిది. ప్రతీ వ్యక్తి ముందు స్పందించిన తరువాతే అర్ధం గురించి వెతుకుతాడు. రావణ విరచిత శివతాండవ స్తోత్రాన్నీ, శంకర విరచిత మహిషాసురమర్దనీ స్తోత్రాన్నీ అర్ధం తెలిసేవరకూ ఆస్వాదించలేమా?
అయితే కొన్నిసార్లు ఈ interpretations మనలో వేరే కొత్త భావాలను మేలుకొలిపి అదే కవితను మనకు కొత్తకోణంలో చూపిస్తాయి. ఇక్కడకూడా interpretation లో లేదు గొప్పతనం – దానికి స్పందించిన మనలోనే ఉంది. అలా మీలో కొన్ని స్పందనలకు కారణభూతుడిని అవ్వాలని ఆశిస్తూ —
మొత్తం పాటను కవికి అన్వయించుకుంటూ ఒకసారి, రవికి అన్వయించుకుంటూ ఒకసారి వినండి. (పోనీ ఇలా 5 సార్లు, అలా 5 సార్లు).
Kranthi
August 10th, 2008 9:14 am కు
Great what a great explanation thanks.
అని అన్నారుithink08
August 10th, 2008 10:59 am కు
ఇక్కడ మీరు చెప్పిందంతా, సిరివెన్నెల గారు ఈ వీడియోలో చాలా వివరణతో చెప్పారు.
అందరూ ఈ వీడియో చూడండి…చాలా మంచి పాట, మంచి అర్ధం కూడా.
http://video.google.com/videoplay?docid=-2664288760738767402
అని అన్నారుకొత్తపాళీ
August 11th, 2008 7:52 am కు
ఈ పాట మీద నా నిరసన
అని అన్నారుMalleswari
October 28th, 2009 10:13 pm కు
nenu kooda naa vyakhyanam vrasanu choodandi mtarigopula.blogspot.com
అని అన్నారు