చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్ధం

Friday, April 3, 2009 14:59
తాత - మనవడు విభాగంలో ప్రచురించబడినది.

ఎన్నాళ్ళో గడిచినా, ఎన్నేళ్ళో ముగిసినా ఏ ఏటికాఏడే కళ్యాణమా!
పిల్లను గెలిచావనా, విల్లును విరిచావనా ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమా!
కాపురమంతా కారడవిగా, జీవితమంతా కష్టాలుగా..
చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్ధం,
పరిణయంలో పరమ రహస్యం తెలుసుకుంటే తారకమంత్రం.

రామయ్యా! వివాహ దిన శుభాకాంక్షలు. అసలు నువ్వున్నావా! లేవా? ఏమిటో, చుట్టూ నువ్వు తిరుగాడిన నేల అంటారు తాతగారు. అమ్మ స్నానం చేసిన సెలయేరు అదిగో నీళ్ళు జల్లుకో అంటారు. నాకేమో నమ్మబుద్ధి కావడం లేదు. ప్రతీ ఊరిలోనూ నీ అడుగులేనా… అసలు ఏది నిజం ఏది అబద్ధం? అసలు ఇలాంటి పుక్కిట పురాణాల్ని నిజంగా జరిగాయని నమ్మించడానికి ప్రయత్నించడంలో ఏమిటి అర్థం? అవి నీ అడుగులు కాకుంటే నీ గొప్పతనం తరిగిందా? ఆ సెలయేటి నీరు అమ్మని తాకితే ఆమె గొప్పతనం హెచ్చిందా?

ఏమిటయ్యా! నీలో నీవే గొణుక్కుంటున్నావు అంటూ పూజారిగారు ముందుకు వచ్చారు.

“ఏమీ లేదండి. శ్రీరామనవమి కదా! దండం పెట్టుకుంటున్నాను. ”

“అదేమిటయ్యా! నీకు ఈ దేముళ్ళూ గట్రా నమ్మకం లేదనుకుంటానే. ”

” నాకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదండి.. కానీ నేను పెట్టే ఈ దండం మా తాతకి ఆనందాన్నిస్తుంది. నేను పెట్టే ఈ దండం నాకేమీ నష్టాన్ని కలిగించడం లేదు. ఒక దండం పెడితే నేనేమన్నా అరిగిపోతానా కరిగిపోతానా – అందుకని పెట్టేస్తున్నా”

“అయితే ఇంతకీ దండం ఎవరికి పెట్టావు? ఏమని పెట్టావు? ”

“తెలీదండి… చేతులు రెండూ జోడించా… ఎదురు విగ్రహాన్ని చూస్తున్నా. ఏమని అడగాలో తెలియడం లేదు. పూజారిగారూ, చిన్న సందేహం – నిజంగా కోవిల వెనకున్న పాదాలు రాముడివేనా? ఆ కోనేట్లో సీతాదేవి నిజంగా స్నానం చేసిందా? నేను వాల్మీకం చదివాను. ఎక్కడా రాముడు ఈ దారంట వెళ్ళినట్టుగా చెప్పబడలేదు. అయినా అంతవరకూ ఎందుకు.. నిజంగా అప్పటి ముద్రలు ఇప్పటిదాకా ఎందుకు మిగిలుంటాయి? నిజంగా మిగిలితే మరి ఆ ఒక్క అడుగే ఎందుకు మిగిలింది? ఇక్కడ ఒక అడుగు వేసి రాముడు మళ్ళీ లంకలో ఇంకో అడుగు వేసాడా ఏమిటి? అయినా రామాయణం జరిగిందంటారా? అది నిజంగా జరగలేదు అని అనుకున్నంత మాత్రాన రాముడికి కానీ, వాల్మీకికి కానీ, నమ్మే మనుష్యులకి కానీ వచ్చే నష్టం ఏమిటి? ఒక పురాణ కథని చరిత్రగా కలిపెయ్యటం ఎందుకు?”

“నీ ఉద్దేశ్యం ఏమిటి? ఇలా ఎందుకు జరిగిందంటావు? దీనివెనుక ఏమన్నా సుదీర్ఘ కుట్ర దాగి ఉందని నీ అభిప్రాయమా? తరతరాలుగా ఏదైనా ఒక వంశం తన స్వప్రయోజనాన్ని ఆశించి రాముడిని ఇలా ప్రతీ ఊరిలోనూ నడిపించి ఆ డబ్బులు తినేస్తోందనో లేకే వేరే ప్రయోజనాల్ని ఆశించి చేస్తున్నాదంటావా? ”

“లేదండి. అలాంటి అవకాశం కనిపించటం లేదు. ఇవన్నీ వైవిధ్యసంస్కృతులు పరిఢవిల్లిన ప్రదేశాలు. ఇలా జరగటానికి కారణం ఏమైఉండచ్చు అన్నది తెలియటం లేదు కానీ, ఏదో ఆశించి ఎవరో ఒకరో, ఒక కుటుంబమో ఇలా చేసే అవకాశం లేదు.”

“రామాయణాన్ని ఇతిహాసం అంటారు నాయనా! అంటే జరిగిన పురాణ కథ అని. అయితే సంవత్సరాలు గట్రా పేర్కోకుండా ఎందుకు చేసారు అన్నది ప్రశ్న. వాల్మీకం చదివానంటున్నావు కదా – రామాయణం ఎలా ప్రారంభమౌతుంది నాయనా? ”

“వాల్మీకి మహాముని నారదుడిని పురుషోత్తముడెవ్వడు అని అడిగితే… రాముడని ఒకడున్నాడు – సత్యవంతుడు, జితక్రోధుడు, ధర్మపరాయణుడు అంటూ కథ మొదలవుతుంది. ”

“రామాయణం తాలూకు పరమార్థం అదే నాయనా! ఒక పరిపూర్ణమైన వ్యక్తి తాలూకు నడవడిక ఎలా ఉండాలి.. తనపట్ల, భార్య పట్ల, అన్నతమ్ముల పట్ల, కుటుంబం పట్ల, స్నేహితులపట్ల, సమాజం పట్ల, అతని బాధ్యతలేమిటి – అతని హక్కులేమిటి – అతని నడవడిక ఎలా ఉండాలి… ఇది తెలియచేసే కథ నాయనా అది.

ఇంతకీ, ఈ అడుగడుగునా ఉన్న రాముడి చిహ్నాలు మన పూర్వీకులు ఒక ప్రయోజనాన్ని ఆశించి కల్పించారు నాయనా! అందులో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అనేవి వాటి తాలూకు ప్రయోజనరీత్యా పూర్తిగా అప్రస్తుతాలు. అవన్నీ మనకు గుర్తు చేయాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే రాముడు ఒక మనిషి అని. రక్తమాంసాలతో ఈ భూమి మీద చరించిన ఒక మానవుడు ఎంత మహితాత్ముడయ్యాడో జాతి మర్చిపోకూడదు అన్నది మన పూర్వీకుల ఉద్దేశ్యం. He is a risen ape – not a fallen angel. మానవత్వానికీ, మనిషి గడపాల్సిన జీవనవిధానానికీ ఒక ప్రతీక రాముడు. ఈసారి రామపాదాలు చూసినప్పుడు వాటి మీద పసుపూ కుంకుమలు చల్లేకంటా, వాటినుంచి ప్రేరణ పొందు. ఒక అన్నగా ఎలా ఉండాలి – ఒక కొడుకుగా – ఒక భర్తగా – ఒక స్నేహితుడిగా –ఒక నాయకుడిగా – చివరికి ఒక శత్రువుగా రాముడులాంటి వ్యక్తిగా ఉండటానికి ప్రేరణ పొందు నాయనా! అవన్నీ మన అందుబాటులో ఉన్న మనం చేయగలిగిన పనులే అని మనకి తెలియచెప్పడం ఈ చిహ్నాల ఉద్దేశ్యం. ఆ చిహ్నాలు పూర్తిగా తప్పు పద్ధతిలో వాడబడచ్చు. వాటిని దురాశాపరులు చాలా విధాలుగా సొమ్ము చేసుకోవచ్చు. కానీ, వాటిని చూసిన లక్షలాదిమందిలో ఏ ఒక్కరు వాటిని చూసి ప్రేరణపొందినా వాటి ఫలితం నెరవేరినట్టే.

ఈసారినుండి గుడిలో రామ విగ్రహాన్ని చూసినప్పుడు మనిషిలోని మహిమకు దండం పెట్టు నాయనా! ఒక మనిషి సంకల్పంతో, విశ్వాసంతో ఏమి సాధించవచ్చు అన్న ఒక తార్కాణాన్ని చూస్తూ నీలోని ఆత్మశక్తికి దండం పెట్టు నాయనా! నీ సమాజం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ స్నేహితులపట్ల నీ బాధ్యతని నిర్వర్తించే శక్తిని ప్రసాదించమని వేడుకో నాయనా! రాముడు నిజంగా ఈ భూమి మీద నడయాడినా, ఒక కల్పిత పాత్రే అయినా నీ వర్తమానానికి వచ్చిన లోటేమీ లేదు. నీ భవిష్యత్తుని, నీ సమాజ భవిష్యత్తునీ మరింత మెరుగుగా చేయడానికి రాముడి సాయం తీసుకో నాయనా! శ్రీ రామాయనమః ”

ఆలోచిస్తూ రామవిగ్రహం వంక చూసా. మరింత వెలుగులో కనిపిస్తున్నాడు కోదండపాణి. నిజమేనా.. నా వెనక అప్పుడే వెలిగిన బల్బు వల్ల అలా అనిపిస్తున్నాదా?

బ్లాగర్లందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

మీరు వ్యాఖ్యానించవచ్చు, లేదా మీ సైటు నుంచి ట్రాకుబేకు చేయవచ్చు.

“చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్ధం” కు 8 వ్యాఖ్యలు

  1. అరుణ పప్పు

    April 3rd, 2009 4:04 pm కు

    వివాహ మహోత్సవ.. అంటే బాగుంటుందేమో సామీ. టపా బాగుందండోయ్. నేను కూడా అలానే అనుకుంటాను. అవి పురాణాలయినా, కాకపోయినా ఆ మంచిని పాటించడంలో పోయేదేమీ లేదని.

    అని అన్నారు
  2. రవి

    April 3rd, 2009 4:21 pm కు

    ” నాకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదండి.. కానీ నేను పెట్టే ఈ దండం మా తాతకి ఆనందాన్నిస్తుంది. నేను పెట్టే ఈ దండం నాకేమీ నష్టాన్ని కలిగించడం లేదు. ఒక దండం పెడితే నేనేమన్నా అరిగిపోతానా కరిగిపోతానా – అందుకని పెట్టేస్తున్నా”

    పై ముక్క చాలా బాగా చెప్పారు. కాస్త డ్రామా జోడించి, మీరు ఇలాంటి కథలు రాసి పత్రికలకు పంపవచ్చు. బ్లాగు పరిధి కంటే ఎక్కువలో ఉందిది. ఉబ్బేయటానికి కాదు. నిజంగానే చెబుతున్నాను.

    అని అన్నారు
  3. చిలమకూరు విజయమోహన్

    April 3rd, 2009 6:58 pm కు

    రామ విగ్రహాన్ని చూసినప్పుడు మనిషిలోని మహిమకు దండం పెట్టు నాయనా! ఒక మనిషి సంకల్పంతో, విశ్వాసంతో ఏమి సాధించవచ్చు అన్న ఒక తార్కాణాన్ని చూస్తూ నీలోని ఆత్మశక్తికి దండం పెట్టు నాయనా! నీ సమాజం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ స్నేహితులపట్ల నీ బాధ్యతని నిర్వర్తించే శక్తిని ప్రసాదించమని వేడుకో నాయనా!
    చాలా బాగుంది
    మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది మీతాతగారి ఆనందంకోసం మాత్రమేకాదు మీకోసం కూడా

    అని అన్నారు
  4. రామేశబాబు

    April 3rd, 2009 6:58 pm కు

    అసలు దేముడున్నాడా? లేడా? అనే సమాధానం దొరకని ప్రశ్నని పక్కన పెడితే, మీరు చెప్పిన కారణం సామాజిక న్యాయం ఖచ్చితంగా తెస్తుందనే ఆశ.

    మీ ఆలోచనా పద్ధతి బాగుంది సారు, మీ బ్లాగులానే

    అని అన్నారు
  5. Sravya

    April 3rd, 2009 7:55 pm కు

    చాలా చాలా బాగా చెప్పారు ! మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

    అని అన్నారు
  6. సుజాత

    April 3rd, 2009 8:23 pm కు

    రవి గారితో ఏకీభవిస్తున్నాను. ఇంతకు ముందో సారి ఇలాగే రాముడి గురించిన పోస్టులోనే అభిప్రాయం రాద్దామని వచ్చి అప్పుడూ ఇలాగే రవి గారితో ఏకీభవించి వెళ్ళాను. బాగుందండీ మీ టపా పండగ పూట!

    అని అన్నారు
  7. nagamurali

    April 3rd, 2009 9:26 pm కు

    >> ఒక దండం పెడితే నేనేమన్నా అరిగిపోతానా కరిగిపోతానా
    - మీలాంటి వాళ్ళకి దణ్ణం పెడితే లోపలుండే ‘ఇగో’ల్లాంటివేవో అరిగిపోవచ్చు, కరిగిపోవచ్చు. అంతమాత్రం చేత రాముడున్నాడని దణ్ణాలు పెట్టేస్తే సమాజం ఏమైపోవాలి? ఏ రాతి యుగంలోకి వెళ్ళిపోవాలి?

    మీ వెనకాల ఒక బల్బు ఉంది కాబట్టి అది వెలిగింది. అసలు బల్బే లేకపోతే??

    ఎందుకొచ్చిన ప్రశ్నలు బాబూ!! బోలెడు పనుల్తో బిజీగా ఉన్నా. రామనవమి పూటా ఒక నిమిషం రాముడి మీదకి నా మనసు మళ్ళించారు. ఆ పుణ్యమంతా మీదే. (యథాప్రకారంగా టపా చాలా బాగా రాశారు.)

    అని అన్నారు
  8. parimalam

    April 4th, 2009 12:23 am కు

    చాలా బాగుంది మీ టపా ! మీకూ శ్రీ రామనవమి శుభాకాంక్షలు..

    అని అన్నారు

వ్యాఖ్యానించండి