ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమసమూహములు
Sunday, February 8, 2009 21:29అయ్యలారా! అమ్మలారా! మా ఊరు విజయనగరం. విద్యానగరం. ఘంటసాల వారు నడయాడిన నేల. గురజాడ వారి గుర్తులు మిగిలిన నేల. కొంచెం కొంచెంగా మా సంస్కృతినీ, ప్రాభవాన్నీ, కళాపోషణనీ వదిలేస్తూ – మా తాతలు తాగిన నేతిని మా మూతుల దగ్గర వాసన చూడమంటున్నాం గానీ… ఐనా మాది విజయనగరమే – విద్యానగరమే…
15 సినిమా హాళ్ళతో, 10 పిజ్జా కార్నర్లతో ఇవాళ ఇలా కళకళలాడిపోతున్నాం గానీ – నా చిన్నప్పుడైతేనా అబ్బబ్బ – ఆ అవధానాలూ,అప్రస్తుత ప్రసంగాలూ – ఆ అవధాని విజయనగర ప్రజల ఆసక్తికీ, ఆశక్తి కీ నాలుగు నమస్కారాలు పెట్టి చెంపలేసుకోవడం – ఎంత విసుగుగా ఉండేదనుకున్నారు? అయినా రివ్వున ప్రపంచం 21వ శతాబ్దంలోకి దూసుకుపోతూ ఉంటే, మేము సైతం… మేము సైతం అంటూ కాస్త ఉన్నవి వదిల్చేసుకుంటున్నాము అంతే…
నా ఐదవ క్లాసులో అనుకుంటా.. మేడసాని మోహన్ గారి శతావధానం. యశస్వి యస్వీజోగారావు గారి అప్రస్తుతప్రసంగం. అవధానం సాగుతోంది. ఒక అమ్మాయి లేచి పొట్టిగా ఉండే మేడసానివారిని చూసి మీరు అమితాబ్ బచ్చన్ లా ఉన్నారండీ! అన్నాది. నేనమితాబ్బునైనను, జయబాధురీవు కాకుము తల్లీ! హేళనమాని నా మానమ్మున నన్ను పోనిమ్ము మంజులవాణీ! అన్నారాయన. వింటున్న యస్వీజోగారావు గారు – పొట్టిగా ఉన్నానని మీరు ఏడుస్తారనుకున్నానే – సరిలెండి అల్లసానివారు అల్లనల్లన ఏడ్చె మరి మేడసానివారు ఎట్లేడ్తురో! సమస్యను పూరించండి అన్నారు. పూరణ గుర్తులేదుగానీ, పూర్తవుతూండగానే మహానుభావుడు దాశరధిగారు ముఖ్య అతిధిగా సభలో అడుగుపెట్టారు. అవధాని లేచి నుంచుని దాశరధీ! కవితా పయోనిధీ అన్న మకుటంతో 11 పద్యాలు చెపుతూ ఉంటే – సభంతా లేచి నించుని కరతాళధ్వనులు చెయ్యడం ఎంత విసుగుగా ఉండేదనుకున్నారు – అబ్బో – నేను కాబట్టి ఏదో అలా కూచుని భరించానండి.
మోహనా! అవధాన కంఠీరవా! అంటూ వేదికమీదున్న మానాప్రగడ శేషసాయిగారు పద్యం పాడేస్తున్నారు. ఆపండి అని గట్టిగా అరిచిన జోగారావుగారు – ఇది సింహం పిల్లకాదు – సింహమే అన్నారు. నిండా 30 ఏళ్ళ వయస్సు లేని అవధానిని చూస్తూ – జూలు కనిపించలేదు అందుకని కంఠీరవా అన్నాను అని సర్దుకోబోయారు శేషసాయిగారు. జూలోకొస్తేగా నా జూలు సంగతి తెలిసేది అని మోహన్ ముక్తాయింపు. అయ్యా!అమ్మా! ఇందులో ఆనందించేదిగాని, ఆహ్లాదపరిచేదిగాని ఏముందండి… ఏమీ లేదు.
చిన్నప్పుడు చక్కగా పైడితల్లి అమ్మవారి పండగ అంటే 10 రోజులముందునుంచీ పులివేషాలు, కర్రసాములు, కత్తిసాములు ప్రారంభమయ్యేవి. పులివేషం ఒక 30 కేజీల పిల్లవాడిని పంటితో ఎత్తి కరచిఉంచి పులి అడుగులు వేసేవారు. కర్రకి అడుగున కుంకుమ అంటించి కర్రసాము జరుగుతూ ఉండేది. ఎదుటివాడి నుదుట కర్రతో కుంకుమబొట్టు పెడితే విజయం. మనిషి నాలుకమీద తమలపాకునుంచి ఒకే కత్తివేటుతో దానిని రెండు ముక్కలు చేసేవారు. ఇలాంటి నిరుత్సాహభరిత జీవరహిత – అదేనండీ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని కళలనుంచి – రాత్రంతా సినిమాలు, చూడ ముచ్చటేసే రికార్డింగు డాన్సులు – ఈ రెంటికీ ముందు మానసిక స్థిరత్వానికి మందుకొట్టడాలు – అబ్బో – మా ఎదుగుదల గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే సాధ్యమా!
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు వారి ఉత్సవాలు జరిగేవి. తంజావూరులో త్యాగరాజ ఉత్సవాలు ఎలాగో మాఊరికి ఇవి అలాగ. రాష్ట్రమంతా పేరుగాంచిన హరికథకులు వచ్చి కథ చెప్పేవారు. అమ్ముల విశ్వనాధం భాగవతార్ లాంటివారి కథకు కూర్చోడానికి జాగా దొరికేది కాదు. సంగీతసాహిత్యసవ్యసాచుల్లాంటి వాళ్ళు కథ చెప్తూ ఉంటే – ఇది నిజమవ్వచ్చా, లాజిక్కేదీ లాంటి ప్రశ్నలే రానివ్వకుండా కథలో లీనం చేసేసేవారండి. ఈ మత్తు ఉంది చూసారూ – అసలు పురాణాలే కట్టుకథలండి – వాటి అస్తిత్వాన్ని ప్రశ్నించాలి కదండి – అసలు వాళ్ళు కథ చెబుతూ ఉంటే అసలు ఆలోచనే వచ్చేది కాదండి. ఇయంసీతా మమసుతా అన్న శ్లోకం చదివి అమ్ముల విశ్వనాథం గారు దాని అర్థాన్నీ, రాముడు తానందుకున్న చెయ్యిని ఎంత అపురూపంగా కాపాడుకున్నాడు అని చెబుతూ ఉంటే – చిన్న వయస్సు కదండి – తెలిసేది కాదు – ఎందుకో – చూసుకుంటే కళ్ళ నీళ్ళండి. అంత మూర్ఖంగా అమాయకంగా ఉండేవాళ్ళమా అండి – ఇప్పుడు చూసుకోండి మా బొంకులదిబ్బమీదొట్టు – వారంరోజులు జరిపే ఉత్సవాల్ని 2 రోజులు జరపడానికి కానీ, కనీసం 50 మంది ప్రేక్షకుల్ని కూడగట్టడానికి కానీ మూడు చెరువులు (అదేనండి – అయ్యకోనేరు, పెద్దచెరువు,బుచ్చన్నకోనేరు) నీళ్ళు తాగుతున్నారు మా వాళ్ళు. మేము ఎదిగిపోయామండి.
నా స్నేహితుడు ఒకడనేవాడండి – ఈ ప్రపంచంలో ఏ పాయింటు కైనా X,Y,Z లతో పాటు టైం అనే నాలుగో అక్షం ఉంటుంది. ఇది ప్రతి క్షణానికీ మారిపోతూ ఉంటుంది. ఈ నిరంతర చలనమే జీవాధారం. ఈ మార్పే శాశ్వతం. కాకుంటే మన విజయనగరానికి సమస్య ఏమిటంటే ఈ టైం అన్న అక్షం విజయనగరానికి సంబంధించి 1900 లో ఆగిపోయింది అనేవాడండి. అప్పట్లో ఎంత బాగా తిట్టాడు విజయనగరాన్ని అని గొప్ప ఆనందపడిపోయేవాడ్నండి. ఇవాళ మా ఊరిని చూసుకుంటే, అది శాపం కాదు – వరం – నిజమైపోయినా బాగుణ్ణు అనిపించేస్తోందండి. ఆరోజు అదీ మన చేతుల్లోలేదు. ఈరోజు ఇదీ మన చేతుల్లో లేదు. ఏమి చేస్తాం చెప్పండి?
అయినా ఫుల్లు ఎడుకేటెడ్ ఐన మన బ్లాగర్లు ఇంత సాంప్రదాయంగా, సంస్కారవంతంగా, సహన పూరితంగా, సౌశీల్యంతో సహవాసం చేసేస్తూ ఉన్నారు – ఇది కూడా మనం నేర్చేసుకోవాల అని మా ఊరి జనానికి డప్పేసి కొట్టేసి సెప్పెయ్యాల! మరి మేము కూడా డెవలప్ కావాలి కదేటి?
నాగమురళి
February 8th, 2009 11:05 pm కు
భలే రాశారండీ. మొత్తానికి విజయనగరంలో కూడా ఆగిపోయిన కాలం కదలడం మొదలైందన్నమాట.
(అన్నట్టు ఇంకో సంగతి గుర్తొచ్చింది. Theory of Relativity గురించిన పుస్తకాల్లో చదివేను. కాలం అన్న అక్షంలో మనం అంతా ఎంత వేగంతో ప్రయాణం చేస్తున్నామో తెలుసా? కాంతి వేగంతో.)
మీర్రాసినది చదువుతుంటే టైం మెషీన్ లాంటిదేమైనా దొరికితే బాగుణ్ణనిపిస్తోంది.
అని అన్నారుఅసంఖ్య
February 8th, 2009 11:49 pm కు
ఈ టపాకి నన్ను ఆకర్షించింది “విజయనగరం”. భలేగారాసారు అని తరచి చూస్తే, రాసింది “కృష్ణమోహన్”. వెంటనే అనుమానం, ఇది నాకుతెలిసిన కృష్ణమోహనేనా అని. వెంటనే, పాతటపాలన్నె తిరగేసాను, కనిపించిన పదాలు:
చదరంగం, నాగరాజు, uniquecyberzone
“chess”: విజయనగరంలో చదరంగం చాంపియన్ ఎవరంటే “కృష్ణమోహన్” అని సమాధానం, మరి
“నాగరాజు”: ఇలా సాలభంజికలు గారిని “నాగరాజు” అని సంభోదించేంత చనువు ఎవరికుంది?
“uniquecyberzone”: కోట పక్కన జీయర్ complex లో ఉన్న uniquecyberzone అనే శిక్షాణా సంస్ధని నడుపుతున్నది ఎవరు, “కృష్ణమోహన్” కదా!
పరిచయం ఉన్న మాఊరి బ్లాగరు, బ్లాగుద్వారా మళ్ళే పరిచయం అవడం, ఓహ్, భలే సంతోషంగా ఉంది.
-శేఖర్
అని అన్నారు(అసంఖ్య అనే పేరుతో రాయడం మళ్ళీ మొదలుపెట్టాను, 2005 లో తెలుగు బ్లాగింగ్ మొదలు పెట్టి, ఆపేసి, తరువాత. మీ బ్లాగ్ విలాపం చదవక ముందేలెండి. btw, బ్లాగ్ విలాపం అదిరింది కృష్ణమోహన్. విజయనగరం కీర్తి ప్రతిష్టలు మీలాంటివాళ్ళవల్లనే పదికాలాలు నిలబడతాయి.
)
వికటకవి
February 9th, 2009 2:36 am కు
పర్లేదులెండి. కరక్టుగా మరో పాతికేళ్ళ తర్వాత మరో మహానుభావుడు ఈ మాత్రం తెలుగులో రాసుకుంటున్న బ్లాగుల్ని గుర్తుకుతెచ్చుకుని మీలా మురిసిపోతాడు లెండి. కాలచక్రమా మజాకా?
అని అన్నారుకామేశ్వర రావు
February 9th, 2009 11:48 am కు
ఒసోస్, శ్రీశ్రీ బాబు మాటనొట్టుకొచ్చేసి టైటిలెట్టేసినావే టపాకి! శ్రీశ్రీ బాబు మనోడు కాదు, ఇసాపట్నవోడు. అంతకు ముందే మన గురజాడ అప్పారావు గోరు “మంచి గతమున కొంచెమేనోయ్” అన్లేదేటి. మనోళ్ళు ఆరి అడుగుజాడల్లో నడుస్తూ మరో అడుగు ముందుకేసేసి, అసలక్కడ మంచి కొంచెం కూడా లేదు ఎల్లెహె అని దాన్ని పూర్తిగా ఒగ్గేసినారు. అంతేకదా!
అని అన్నారురవి
February 9th, 2009 2:13 pm కు
మంచి డెవలప్ మెంట్ దిశగా ఎళ్ళిపోతుంది మీ విజయ నగరం…(15 సినిమా హాళ్ళతో, 10 పిజ్జా కార్నర్లతో)
అని అన్నారుకొత్తపాళీ
February 10th, 2009 12:19 am కు
బాగుంది. దాశరధి ఎపిసోడ్ ముచ్చటగా ఉంది. నిజమే, విజయనగరమంటే, ఒకనాడు వోలు మొత్తం ఆంధ్రాకి కల్చరల్ సెంటరు గదా.
అని అన్నారుk.pullarao
February 20th, 2009 3:30 pm కు
mee blog baavundhi all the best
అని అన్నారు