బ్లాగు విలాప కావ్యం…
Saturday, January 24, 2009 23:26నే నొక బ్లాగుమొక్క కడ నిల్చి చివాలున లింకునొక్కి డె
ల్లన్నంతలోన, టపా లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది బ్లాగువిలాప కావ్యమై.
జల్లెడ యొడిలోన కూడలి తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష వ్యాఖ్యల కొరకు!
హృదయమే లేని నీ టపా లెందుకోయి?
జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమృద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
బ్లాగర్లకై పూయదే నాల్గు చిన్ని టపాలు?
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన కూడలి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆర్కైవు చల్లని కాలి ఫైళ్ళపై.
బ్లాగర్లని గౌరవింతుము జ్ఞానము పూసి; సమాశ్రయించు పాఠకులకి
విందు చేసెదము కమ్మని నవ్వులు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; టపాకి వ్యాఖ్యకు వేరు సేతువే!
గొంతు దురద కోసమయి అన్యుల గొంతులు నొక్కి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి టపా వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి గూగులు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?
ఊహ దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి వ్యాఖ్యలు గ్రుచ్చి కూర్చి
పంచుకొందురు ముచ్చట లింకుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు
గుండె తడి లేక విజిటర్ల లెక్కను పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
బ్లాగు దేహాలపై కీర్తి కొరకు
పులుముకొందురు మీ రాకాసిబ్లాగర్లు
అక్కట! హాయి మేము అనానిమస్సులెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు వ్యాఖ్యలతో
ద్రొక్కుచు దొర్లి – దొర్లి – మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి డెలీటుతోడ చంపి మ
మ్మావల పారబోతురు గదా! బ్లాగుజాతికి నీతి యున్నదా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.
టపా లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?
ఇట్లు టపాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ – బ్లాగు చంప చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను
ఈ మధ్య వరసగా మూసేస్తున్న బ్లాగులను చూస్తూ ఉంటే కలిగిన చిన్న చిలిపి ఆలోచన. చాలా చోట్ల ఛందస్సు తప్పింది – మూలాన్ని మీకు స్ఫురింపచేయడం కోసం అలా చెయ్యాల్సి వచ్చింది. పద్యశిఖామణులు క్షమించాలి. కరుణశ్రీ గారికి కృతజ్ఞతలూ,క్షమాపణలూ ఒకేసారి అందచేస్తూ… సహస్రవందనచందనాలర్పిస్తూ…
భవదీయుడు
చివుకుల కృష్ణమోహన్
నాగమురళి
January 25th, 2009 12:23 am కు
హహ్హహ్హ…. కృష్ణమోహన్ గారూ, చాలా బాగుంది. తెగనవ్వుకున్నాను చదివి.
అని అన్నారుకొత్తపాళీ
January 25th, 2009 1:09 am కు
హ హ హ ..
బ్లాగు బ్లాగు
చాలా లైటుగా వొదిలేశారు. ఒకేళ ఈ పేరడీ నేణు రాసి ఉంటే ఇంకాస్త ఘాటెక్కి ఉండేది.
“గుండె తడి లేక విజిటర్ల లెక్కను పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను”
సెబాసు!!
అని అన్నారుcbrao
January 25th, 2009 4:08 am కు
అవును, ఈ మధ్య ఒకదాని తరువాత ఒకటిగా బ్లాగులు మూత పడటం విచారకరం. ఇలా బ్లాగుహత్యలు చేసుకునేవారికై, తక్షణమే ఒక సహాయ కేంద్రము నెలకొల్పవలసిన అవసరం ఉంది. బ్లాగు విలాపము ఈ ఆలోచన కలిగించుటలో సఫలమైనది.
అని అన్నారుసుజాత
January 25th, 2009 7:46 am కు
“ఆ పై డిలీటు తోడ జంపి….మమ్మావల పారవేతురు కదా” హ హ !కరుణశ్రీ గారుండి ఆయన బ్లాగులు చదివితే సెభాషకన మానరు.మీరు తరచూ రాయాలని, తీరిక చేసుకోవాలని పురజనుల కోరిక!
అని అన్నారుbollojubaba
January 25th, 2009 11:23 am కు
పద్యాలంటే కొంచెం భయమైనా పట్టుపట్టి చదివాను.
అని అన్నారుచాలా సరళంగా ఉండి ఓ వందపేజీల వచనం చదివిన అనుభూతినిచ్చింది.
మీ భావాలతో ఏకీభవిస్తున్నాను.
teresa
January 25th, 2009 9:17 pm కు
బావుంది
అని అన్నారుతాడేపల్లి
January 27th, 2009 12:02 am కు
చాలా బాగా రాశారు.
అని అన్నారుగోపాల కృష్ణ
January 28th, 2009 12:13 am కు
భలే బావుందండీ! బ్లాగు మనసు బ్లాగా అర్థం చేస్కున్నారు!
అని అన్నారుచివుకుల కృష్ణమోహన్
January 28th, 2009 4:19 pm కు
ఏమిటో బ్లాగులు మూసేసినవాళ్ళు ఎవరన్నా వచ్చి మేము తెరిచేస్తున్నాము – ఈ టపా మాలో మార్పు తెచ్చింది అని అనేస్తారని సినిమా కల.. అస్సలు నెరవేరలేదు..
@నాగమురళి – ధన్యవాదాలు.
@కొత్తపాళీ – ధన్యవాదాలు, మీ ఘాటు తాళింపు ఎలా ఉంటుందో చూపించండి – నోరూరుతోంది.
@సీబీరావుగారు – అలాంటి పని ఏదో మొదలెట్టండి – మీరు ప్రస్తుతం వెలువరిస్తున్న ఆణిముత్యాలని ఇలాగన్నా పక్కనపెడితే సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు.
@సుజాతగారు – ధన్యవాదాలు. మరింత తరచుగా వ్రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.
@బాబా – కవితా కన్య మెచ్చిన చెలికాడు మీరే పద్యాలగురించి అలా అనేస్తే – ఇంక మా బోంట్లు ఏమవ్వాలి? కామెంటినందుకు ధన్యవాదాలు.
@teresa – ధన్యవాదాలు.
@తాడేపల్లి – ధన్యుడిని. మీ మెప్పు పొందగలిగాను.
@గోపాలకృష్ణ – ధన్యవాదాలండీ. నోరు విప్పి బ్లాగు చెపుతూ ఉంటే విని వ్రాయడమే – అర్థం మీరు చేసుకున్నారు
అని అన్నారువికటకవి
January 28th, 2009 7:07 pm కు
ఈ టపా చూడగానే ఆ మధ్యన బ్లాగువిలాపం అని మొదలెట్టిన ఓ హాస్యాత్మక బ్లాగు గుర్తొచ్చింది. దురదృష్టవశాత్తు ఆ విలాపంతోనే మూతకూడా పడ్డట్లుంది. మీరూ విలపిస్తున్నారు. పుష్పవిలాపం చదివి, విని కొందరు ఆడవారు పూలు పెట్టుకోవటం మానేసినట్లు, మీ విలాపం చదివి బ్లాగులు మూయాలన్న ఆలోచన మానేస్తే బాగుంటుంది.
అని అన్నారుసిరిసిరిమువ్వ
January 28th, 2009 7:48 pm కు

అని అన్నారుఊహ దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి వ్యాఖ్యలు గ్రుచ్చి కూర్చి
పంచుకొందురు ముచ్చట లింకుల మమ్ము
అకట! దయలేని వారు “మీ యాడువారు”—-ఇక్కడ యాడువారేనా!
ఊకదంపుడు
January 28th, 2009 8:50 pm కు
యాడు వారు అంటే , ప్రకటనలవారు – చదువరిగారినడిగి చూడండి..
“పంచుకోవటం” అనే దానికి విపరీ తార్ధం తిస్తే తప్ప, ఈ పద్యం బ్లాగరులని మెచ్చుకున్నట్టు అనిపించింది నాకు మొదటి మూడుపాదాలు చదివితే..
అని అన్నారునాల్గో పాదం లో భళిర, రసికాగ్రగణ్యులీ బ్లాగువారు అంటారేమో అనుకున్నాను.
radhika
January 28th, 2009 11:51 pm కు
చాలా బాగా రాశారు.
అని అన్నారురవి
February 3rd, 2009 12:09 pm కు
“అకట! దయలేని వారు మీ యాడువారు” …మా మూగ బాధ మీ కవిత రూపంలో బయటకు వచ్చింది. అద్భుతంగా ఉంది.
అని అన్నారుlalithasravanthi
February 8th, 2009 11:24 pm కు
super
అని అన్నారుsiriishasrii
June 12th, 2009 9:57 pm కు
chaalaa nachchiMdaMDI!
mI blog pErEmiTO ardhaM kaalEdu;mari,naa blaagulO diinni vEstunnaanu;mIku anumati tIsukOvaalaMTE elaagO telI lEdu mari?
అని అన్నారుmottaaniki
chaalaa navvochchiMdi,mI pEraDii gaaraDI! adbhutaM!