స్వరరాగగంగాప్రవాహమే…

Sunday, December 14, 2008 0:21
అవీ ఇవీ విభాగంలో ప్రచురించబడినది.

ఉత్సుకత – ఉత్కంఠ – ఉద్వేగం. అన్నీ కలగలిపిన అదో విచిత్రమైన అనుభూతి. కొన్ని క్షణాలలో నేనింక ఆనందపు అవధులను దాటి ఆకాసపు ఆ కొస అందుకోబోతున్నానని. కాలం గడవటం లేదు. ఎలా ఉంటుంది ఆ అనుభూతి. నిజంగా నన్ను నేను కోల్పోతానా – అనాది జీవన వేదంతో కంపిస్తానా ఎద కనుమలలో విరించి విపంచి గానం వినిపిస్తుందా – ఆలోచనలు ఎడతెగటం లేదు.
నాకు కర్నాటకశాస్త్రీయ సంగీతమంటేనే పరిచయం లేదు. అప్పుడప్పుడూ విన్న బాలమురళి పంచరత్నాలూ, రామదాసు కీర్తనలూ, మరిన్ని నేదునూరి ఆలాపనలూ – వినడం – ఆహా బానే ఉందే – అనుకుని కదిలిపోవడం తప్ప శాస్త్రీయ సంగీత కచేరీని పూర్తిగా విన్నది లేదు. హాలులో కూర్చున్నాను. ఉత్సుకతతోపాటు కొంచెం అనుమానం, కొంచెం అపనమ్మకం. ఎప్పుడు చప్పట్లు కొట్టాలో కూడా తెలియదు. అసలు రాగం అంటే తెలిస్తేగా రాగాలాపన బాగుందని మెచ్చడానికి. మూడు గంటలు కూర్చోగలనా అన్న అనుమానం. చుట్టూ ఉన్నవాళ్ళకి మనకంటా బోలెడు తెలుసేమో అన్న సందేహం. మన అజ్ఞానం బయటపడిపోతుందేమో అన్న సిగ్గు. ఐనను, ఇవాళ విని తీరాల్సిందే అని కూర్చున్నాను.

నెమ్మదిగా కార్యక్రమం ప్రారంభమయ్యింది. పరిచయకర్త పక్కవాద్యగాళ్ళని పరిచయం చేస్తున్నాడు. ఘటం, మృదంగం – ఒక్కొక్కరూ వచ్చి సభకి నమస్కారం చేసి తమ స్థానాల్లో కూర్చుని శ్రుతి సరిచూసుకుంటున్నారు. పరిచయకర్త గొంతు పెంచాడు. వయొలిన్ చక్రవర్తి, స్వరరాజు, పద్మభూషణ్ డాక్టర్ ఎల్. సుబ్రమణ్యం అంటూ పెద్దగా పిలిచాడు. చిన్నగా పొట్టిగా బక్కగా ఉన్న ఒక వ్యక్తి నెమ్మదిగా వేదికమీదకి వచ్చి అందరికీ నమస్కారం చేసి తన స్థానంలో కూర్చున్నాడు. అంతకు ముందు టీవీల్లో గట్రా అతని ఫోటో చూసాను – అయినా ఏమిటో చెప్పలేని అనుభూతి. ఇతనేనా ఆ స్వరబ్రహ్మ? కమానుతో ఆ చిన్న వాయిద్యాన్ని పట్టుకున్నట్టు నటిస్తూ మనందరినీ వాయులీనం చేసే మాంత్రికుడు ఇతడేనా? ప్రశ్నలు – సమాధానాలు లేని ప్రశ్నలు – కుదురుగా ఉండనివ్వని ప్రశ్నలు.
నవరాగమాలికలో ఒక వర్ణంతో కచేరీని ప్రారంభిస్తున్నా అని చెప్పి మొదలెట్టారాయన. నేను వింటున్నానో లేదో నాకే తెలియదు. నాలోకి నేను తొంగిచూసుకోవడంతోనే సరిపోతోంది. ఇదేనా ఆ అవ్యక్తమైన అనుభూతి – ఇదేనా అవధులు లేని ఆనందం – పలుకుతున్న ప్రతి స్వరానికీ నాలోనేను ఆడుకుంటున్న దోబూచులాట. నెమ్మదిగా స్వరసంచారం వేగాన్నందుకుంటోంది. వేగాన్నే ఆస్వాదించాలా – తెలియటం లేదు. చుట్టూ చప్పట్లు. ఓహో, ఇది చప్పట్లు కొట్టే సమయం కాబోలనుకుంటూ నేను ఒక రెండు కొట్టా. ఇప్పుడు ఖరహరప్రియరాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన, రూపకతాళంలో అన్నారాయన. అంటే ఏమిటో కూడా తెలియదు నాకు. పక్కనున్న పక్కవాయిద్యం వాళ్ళు కూడా ఆపేసి వింటున్నారు. నెమ్మదిగా చిన్న పిల్లకాలువ వేషం వేసుకుని గంగమ్మ తల్లి హరిపాదాన్ని విడి అలకనందాదేవిగా చిన్న నడకలు నడుస్తున్నాది. ఓస్ ఈ గంగమ్మకేనా జనాలు మొక్కేది – ఈ గంగమ్మకేనా శివుడు జటాజూటాన్ని విప్పాల్సి వచ్చింది – ఒక పక్క అనుమానం – మరోపక్క ఉత్సుకత. గమనం సాగుతోంది. ఘటం, మృదంగం, కంజిర, మోసింగు వాయిద్యం వాళ్ళు తమ తమ ప్రతిభ చూపిస్తున్నారు. చిరునవ్వుతో ఆయన తాళం వేస్తూ వారిని చూస్తున్నారు. నా మెదడు మనసులోకి చూడలేకపోతోంది. అనుభూతిని కొలవమంటే నావల్లకాదు అని చెప్పేస్తోంది. ఏమి జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. ఆ క్షణాన్ని, నన్ను నేను కోల్పోయిన క్షణాన్ని, తాదాత్మ్యం చెందిన ఆ క్షణాన్ని, అలా వడిసిపట్టుకోవాలనుకున్నానే. అప్పుడు నన్ను నేను చూసుకోవాలనుకున్నానే. నాకేమి జరుగుతోంది. తాళం అంటే గోద్రెజ్ తాళం గుర్తొచ్చే నేను అసంకల్పితంగా నా పాదాల్ని కదుపుతున్నానేమిటి? స్వరరాగగంగాప్రవాహంలో కొట్టుకుపోతున్నానేమిటి? ఈత కొడుతూ నాకు నచ్చినట్టు నేను ప్రయాణించాలనుకున్నానే. ఇదేమిటి ఇతనెవరు నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు.. నేనొప్పుకోను – నేను లేచి నించోవాలి – నా మెదడు రిమోటు కంట్రోలు నానుంచి ఎవరిదగ్గరకి వెళ్ళిపోయింది… స్వరకల్పన తారాస్థాయినందుకుంది.
నింగినితాకగ పొంగులువారిన వినూత్న వినోద విలాస లాస్యం.
ప్రళయాభీల తరంగిత లీల భయంకరహేల శివంకరుగ్రోల లయించగ చేరగా
అలలై కలలై వడిగా జడిగా
పిడుగుల అడుగుల తడబడు నడకల
చలంచలితపదనూపురఘోషల
కలితనాట్యఘటితఛ్ఛకచకితతటిల్లతాతనూలతికద్యుతిసురఝురజర్ఝరీనాదసందోహిత
దివివధూటి సాగుతోంది… మునుగుతున్నాను – నా అస్తిత్వమే నాకు తెలియటంలేదు. లేచి నించుని చప్పట్లు కొడుతున్నాను. పక్కవారి స్పృహే లేదు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న ఆలోచనే లేదు. తేరుకుంటూంటే మొదటగా చూపు నా వశంలోకి వచ్చింది. కలుస్తున్న నా రెండు చేతులూ కనిపిస్తూ. నెమ్మదిగా ఆ రెంటి కలయిక సృష్టిస్తోన్న ధ్వని చెవినంటింది. నెమ్మదిగా చూపు అటూ ఇటూ తిప్పాను. నాలాగే నించుని ఉన్నారు అందరూ… పశువుల శిశువుల ఫణుల శిరసులూగే పాట పంచామృతాన్ని పానం చేసాను.
ఇంతకీ నా ప్రశ్నలన్నీ ఏమయ్యాయి – ప్రశ్నలే గుర్తుకురావటం లేదు – ఇంక సమాధానాలా … మీకేమైనా తెలిస్తే చెబ్దురూ…

మీరు వ్యాఖ్యానించవచ్చు, లేదా మీ సైటు నుంచి ట్రాకుబేకు చేయవచ్చు.

“స్వరరాగగంగాప్రవాహమే…” కు 12 వ్యాఖ్యలు

  1. కొత్తపాళీ

    December 14th, 2008 5:02 am కు

    Beautiful.
    Apt description of the experience of listening to divine music

    అని అన్నారు
  2. వేణూ శ్రీకాంత్

    December 14th, 2008 8:58 am కు

    వావ్ చక్కని అనుభూతి ని చాలా చక్కగా వివరించారండి. చాలా బాగుంది.

    అని అన్నారు
  3. సుజాత

    December 14th, 2008 8:59 am కు

    మీతో పాటు కూచుని సుబ్రహ్మణ్యం గారి వయొలిన్ వాదాన్ని ఆస్వాదించినట్టు ఉంది.సగీతాన్ని ఆస్వాదిచడం కూడా ఒక యోగమే! రస సిద్ధి కలిగిందన్నమాట మీకు! దాన్ని మాక్కూడా కలిగించినందుకు ధన్యవాదాలు.

    కద్రి గోపాల నాథ్ గారి శాక్సోఫోన్ వాద్యం విన్నారా? వింటే సరే, వినకపోతే వినండి! మళ్ళీ మేము ఇలాంటిదే మరో టపా చదువుతాం!

    అని అన్నారు
  4. కామేశ్వర రావు

    December 14th, 2008 10:40 am కు

    అద్భుతం!

    అని అన్నారు
  5. మాలతి

    December 14th, 2008 5:16 pm కు

    నాకూ ఇలాటి
    అనుభవమేనండి తొలిసారి తిరుపతిలో సుబ్బలక్ష్మి గారి కచేరీలో. అద్భుతం.

    అని అన్నారు
  6. సుజాత

    December 14th, 2008 7:48 pm కు

    మాలతి గారు,
    మీరు ఆ అనుభూతి నుంచి తేరుకోకముందే ‘రససిద్ధి” కథ రాశారా?

    అని అన్నారు
  7. నాగమురళి

    December 15th, 2008 7:54 pm కు

    అద్భుతంగా రాశారు.

    అని అన్నారు
  8. మాలతి

    December 16th, 2008 11:18 pm కు

    సుజాత, వవ్. నిజంగానే అలాగే జరిగింది. కాస్త కుర్రకారు పోకడలు జోడించినా.

    అని అన్నారు
  9. ఊసుపోక -శ్రోతలు కోరని పాటలు « తెలుగు తూలిక

    December 17th, 2008 4:41 am కు

    [...] రెండురోజులకిందట సిరివెన్నెలగారి స్వరరాగగంగాప్రవాహమే చదవడం మూలాన. మనసంగీతంలో ఘనతే అది అని [...]

    అని అన్నారు
  10. ఊసుపోక -శ్రోతలు కోరని పాటలు « తెలుగు తూలిక

    December 17th, 2008 4:45 am కు

    [...] రెండురోజులకిందట సిరివెన్నెలగారి స్వరరాగగంగాప్రవాహమే చదవడం మూలాన. అక్కడ కామెంటులలో సుజాత

    అని అన్నారు
  11. Usha

    December 17th, 2008 10:18 am కు

    వినటం అందులో మునగటం తప్పించి స్వరజ్ఞానం లేదీ సంవత్సరం వరకు. అదీ మా అమ్మయి పుణ్యామాని కలిగే అవకాశం వచ్చింది ఏదో కొంచం. మీ పలుకులు మాత్రం మనసుకి ఆ జ్ఞానం చదివినంతసేపూ అరువిచ్చాయి.

    అని అన్నారు
  12. కౌశిక్

    December 22nd, 2008 10:10 am కు

    చాలా బాగా చెప్పారండీ! నాకు కూడా సంగీతం గురించి తెలియదు సరి కదా, ఇంట్లో ఏమన్నా త్యాగరాజ కీర్తనల కేసెట్టు పెడితే పక్క గదిలోకి పారిపోయ్యేవాడిని. ఐ.ఐ.ఎస్సీ లో ఎమ్మెస్ చేస్తూండగా కర్ణాటక సంగీతం చిన్నప్పటినుండి నేర్చుకుంటున్న కొంతమంది తో స్నేహం కుదిరింది. అప్పుడు తెలిసింది నేను కోల్పోతున్నది ఏమిటో.

    అని అన్నారు

వ్యాఖ్యానించండి