“నారాయణా! స్వామీ! నారాయణస్వామీ!” అంటూ నారదుడు జయ విజయులను దాటుకుంటూ వైకుంఠంలో అడుగుపెట్టాడు. యధాప్రకారం స్వామి తలక్రింద చెయ్యిపెట్టుకుని శ్రీకి చరణాలందించి నిద్రపోతున్నాడు.మళ్ళీ “నారాయణా” అని గట్టిగా పిలవబోయాడు నారదుడు. అమ్మ ఆపి అమ్మాయిని పట్టుకుమరీ వచ్చావేమయ్యా అని అడిగింది.
” అసలు పని నీతోనేనమ్మా! ఆయన లేచుంటే ఏవో పుల్లలు పెడతాడని పడుక్కున్నాడా లేదా అని టెస్ట్ చేస్తున్నా అంతే” అన్నాడు నారదుడు.
“ఎవరీ అమ్మాయి? సరాసరి వైకుంఠానికే పట్టుకువచ్చేసావు. ఏమన్నా తొందర పడ్డావా? హైదరాబాదులో రిజిస్టరు మేరేజి చేసుకున్నావు - ఇప్పుడు అయ్యగారికి చెప్పి ఒప్పించాలి అంతే కదా! నీకెందుకు? నేను చూసుకుంటా అన్ని విషయాలు” అంది నానమ్మ!
” నీకు పరాచికాలెక్కువయిపోతున్నాయి మామ్మా! నేను లోకాల్ని శాంతియుతంగా ఉంచడానికే సమయం సరిపోవట్లేదు. నేను కలహాలు పెట్టడం మానేసి తీర్చడం మొదలుపెట్టాను. మిగిలిన 14 లోకాలకి ఒక్కడే నారదుడు గానీ - బ్లాగ్లోకంలో ఎవరికి వాడే నారద్. అసలు విషయం విను. భూలోక, బ్లాగ్లోక, సువర్లోక,మహర్లోకాల దాకా వ్యాపించిన సమస్య నీ వరకు రాలేదంటే ఆశ్చర్యమే! ఇంతకీ మీరేమి పేపరు చూస్తున్నారు? ఈనాడా? సాక్షా? ఏ పత్రిక చదువుతున్నారు? పొద్దా? ఈమాటా? భూమికా? ప్రజాకళా? కూడలికి వెళ్తున్నారా? అసలు లోకాలు కంపించిపోతూ ఉంటే నీకూ, తాతకూ అసలు చీమ కుట్టినట్టు కూడా లేదే” అన్నాడు నారదుడు.
“నారదా! ఈ బ్లాగ్లోకమేమిటి? కూడలేమిటి? కొంచెం సంస్కృతంలో మాట్లాడవా ప్లీజ్ ” అంది లక్ష్మీదేవి.
“రామాయణంలో పిడకలవేట లాగ అవన్నీ ఇప్పుడు కాదు గానీ, www.koodali.org కి వెళ్ళు. నాల్రోజుల్లో నీకు అన్నీ తెలిసిపోతాయి. ముందు ఈ అమ్మాయి గురించి చెప్పనీ! ఈ అమ్మాయి పేరు ఆమని. కాదు కాదు - అమీనా అని ఈ మధ్యే పేరు మార్చుకుంది. సమస్య ఆ అమ్మాయినే అడుగు” అన్నాడు నారదుడు.
“ఏమి తల్లీ? ఏ రావణాసురుడైనా నిన్ను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడా? మళ్ళీ నరకాసురుడు భూమిపైకి అవతరించలేదు కదా! చెప్పు అవసరమైతే శ్రీవారిని లేపి ఆన్సైటు పంపిద్దాము. దశావతారాలు అయిపోయినా పర్వాలేదు. నేను ఆయన్ని ఒప్పిస్తాను.” అంది లక్ష్మి.
“ఏమి దశావతారాలు తల్లీ - అవసరమైతే మా కమల్‌హసన్ చేతే వేయించుకోగలం మేము. ఆయన ఆన్సైట్ వెళితే మనకు అగ్నిప్రవేశాలే గతి. అసలు మన కష్టాలు రావణాసురుడితో,నరకాసురుడితో ఎప్పుడు వచ్చాయి తల్లీ! 14 ఏళ్ళు నిన్ను అడవుల్లో తిప్పాడు. వాడెవడో నిన్ను ఎత్తుకుపోవడమేమిటి? ఈయన నిన్ను నిప్పుల్లో దూకమనడమేమిటి? పోనీ దూకావా? మళ్ళీ ఆ చాకలాడు ఏదో అన్నాడని నిండు గర్భవతిని - నిన్ను అడవిలో వదిలేస్తాడా? అతడే మా ఆదర్శం అంటున్నారు నేటి మగజాతి. ఇళ్ళల్లో తాపుల దగ్గర్నుంచి యుద్ధాల్లో రేపులదాకా అనాదిగా మగజాతి స్త్రీ శక్తిని అధఃపాతాళానికి తొక్కేస్తోంది. ఈ అణచివేత ఇక సాగదు. నారీశంఖం పూరించాలి. సమరభేరి మ్రోగించాలి. సమరానికి నేడే ప్రారంభం - డొడొడోయి.డొడొడోయ్” ఉద్రేకంతో ఊగిపోతోంది ఆమని.
అమ్మ ఏదో చెప్పబోయి ఆగింది. “సరే నీకిప్పుడేమి కావాలమ్మా!” అంది.
“విప్లవం. తెల్ల విప్లవం. వస్తున్నాయ్ - వస్తున్నాయ్ జగన్మాత రధచక్రాల్”
“కాదు అమీనా - నీకేమి కావాలో చెప్పు ” అంటూ మోచేతితో గుచ్చాడు నారదుడు.
“చెప్పు తల్లీ! ఆర్ధిక సమస్యలు మన ఆడవాళ్ళకు పెద్దగా లేవే! మీకు కూడా నాలో భాగం ఇచ్చారుగా! మీ జీతం మీ బ్యాంకు అక్కౌంటు లోనే పడుతోంది కదా! రేషనుకార్డులు మీపేరుమీదే ఇవ్వమని చెప్పానుగా. అప్పటినుంచే మీ రాష్ట్రంలో “దేవుని పాలన” ప్రారంభమయింది కదా! పావలా వడ్డీలు, డ్వాక్రా గ్ర్రూపులు…”
“ఆర్ధిక స్వాతంత్ర్యం ఎవరడిగారమ్మా! అది మా సమస్య కాదు.”
“మరి - మా చెల్లి ధైర్యలక్ష్మి ని ఈ మధ్యే మీకోసం పంపాను. మీ అందరిలో కొంచెం కొంచెం చేరమని. అన్యాయాన్ని ఎదిరించడానికి మీకు శక్తిని ఇవ్వడానికి. నా స్వామి నన్ను అగ్నిలో ఎందుకు దూకమన్నాడో మీలోకంలో మగాళ్ళకి తెలియదు గానీ - ఒక రకంగా ఆ సంఘటన మంచినే చేసిందిగా మీకు. నా స్వామిని ద్వేషించి అయినా మీకు ఇంటా వంటా జంటా సాయం చేస్తున్న పురుష పుంగవుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టే ఉన్నది కదా! ఆ రకంగా అయినా లోకకళ్యాణం జరిగితే అంతకంటా మాకు కావల్సింది ఏముంది?”
“ఇది చాలదమ్మా! సంపూర్ణ విప్లవం గురించి నేనొక ప్రయత్నం చేసాను. ఇదిగో చూడు” అంటూ ఆమని / అమీనా తన లేప్టాప్ ఓపెన్ చేసి అందులో మీడియా ప్లేయర్ సహాయంతో “జంబలకడిపంబ” అను చిత్రరాజాన్ని ప్రదర్శించింది.
” నీ మార్గం ఎలాఉన్నా నీ ప్రయత్నం నాకు నచ్చింది. ఏమి కావాలో అడుగు. తీరుస్తాను ” అన్నాది అమ్మ.
“అమ్మా! ప్రకృతి విరుద్ధంగా ఏది అడిగినా అది పని చెయ్యదు అని నాకు అనుభవం అయ్యింది. అందులోనూ ఇప్పుడు మాకు కావల్సినవి ఏవన్నా మేమే సంపాదించుకునే స్థైర్యాన్నీ, స్వాతంత్ర్యాన్నీ సంపాదించుకున్నాము. ఈ కాలం తల్లితండ్రులు కొంచెం మారేరు. తమ ఆడపిల్లని కాస్త ముద్దుగానే పెంచుతున్నారు. చదువూ, సంధ్యా నేర్పిస్తున్నారు. మా కాళ్ళమీద మేము నిలబడగలం. కాకపోతే వస్తున్న సమస్యల్లా పెళ్ళి దగ్గరే. “వివాహాలే నశించాలి - నినాదాలే ధ్వనించాలి” “ఇల్లోడే ఇరకటమన్నా - మొగుడే మరకటమన్న” అంటూ చాలా నినాదాలు చేసాం. ఎందుకో వర్కవుట్ కావట్లేదు. ఈ మధ్య స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించే బ్లాగరుచేత చాలా వ్రాయించాము కూడా. అయినా అవి పని చెయ్యడానికి ఇంకొంచం టైము పట్టేట్టు ఉంది. ఈలోగా ఇంకేదైనా పరిష్కారం చూద్దామనీ…”
“సరే ఏమి కావాలి?”
“ఏమీ లేదమ్మా! ఈ మగాళ్ళు తేనె పూసిన కత్తులు. గోముఖవ్యాఘ్రాలు. మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు. వాళ్ళ నిజ స్వరూపం తెలుసుకునే అవకాశం ఇప్పించు చాలు.”
“ఇంతేనా -దానికి మీకున్న ధైర్యం,సమయస్పూర్తి,తెలివితేటలు సరిపోతాయి కదా!”
“లేదమ్మా - మేము తెలుసుకున్నా ఎక్కడో పప్పులో కాలు వేస్తూనే ఉన్నాము. అందుకే వాళ్ళపక్క చూడగానే వాళ్ళ చరిత్ర మొత్తం మాకు తెలిసిపోవాలి.”
“ఓస్ ఇంతేనా - ఆ పని మీ తల్లితండ్రులు ఎలాగూ చేస్తున్నారు కదా - వాళ్ళ కుటుంబ చరిత్ర ఏమిటి? తన బంధువులెవరు? మిత్రులెవరు? ఇవన్నీ కనుక్కునే పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా!”
“అలా కాదు తల్లీ - ఆ మనిషి బయటకు చూపించే రూపం కాదు - లోపలున్న నిజం.”
“లోపల ఒక్క నిజం ఉండదు తల్లీ. ప్రతీ మనిషీ వేలాది భావాల సమ్మేళనం. అందులో సగం ఆ మనిషికే తెలియదు. అలాంటి కోరిక కోరకు. సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది.” అంటూ వారించింది లక్ష్మీదేవి.
“లేదు తల్లీ పోనీ అందరు మగాళ్ళగురించీ అవసరం లేదు. తాను చేసుకోబోయే మగాడి గురించి తెలిస్తే చాలు.” అంటూ మంకుపట్టు పట్టింది అమీనా.
“సరే - కానీ ప్రస్తుతం సృష్టి వెర్షన్ 24.2 నడుస్తున్నాది. అందులో ఇలాంటి ఫీచర్ పెట్టడానికి అవకాశం లేదనుకుంటాను. మా అబ్బాయిని పిలుస్తానుండు ” అంది లక్ష్మి.
“ఆ విరించి వద్దమ్మా! విపంచిని ధరించిన మీ కోడలిని పిలువు తల్లీ” అంది అమీనా.
“ఎందుకులే మనమే అక్కడకి వెళ్దాము - అవసరమైతే అక్కడి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్టులతో కూడా మాట్లాడవచ్చు” అంటూ బ్రహ్మలోకాన్ని చేరారు లక్ష్మీ,నారద,అమీనాలు.
బ్రహ్మలోకంలో బ్రహ్మ బ్రహ్మనిద్రలో ఉన్నాడు. సరస్వతి “అత్తయ్యా” అంటూ ఎదురొచ్చి సత్కారాలు చేసింది. విషయం మొత్తం కనుక్కుని - “కొంచెం కష్టమేనేమో! మొన్నామధ్య చిత్రగుప్తుడు యమలోకంలో క్రిప్టోగ్రఫీతో 10240 బిట్ల ఎన్క్రిప్షన్ వాడితేనే ఎవరో హాకింగు చేసి పాపపుణ్యాల చిట్టా మార్చారని తెలిసింది. అందుకే మొన్నే మీ అబ్బాయి 20480 బిట్ల పబ్లిక్ ఎన్క్రిప్షన్ తో కొత్త సిస్టం ఇన్స్టాల్ చేసారు. ఇది హాకింగు చెయ్యడం అసాధ్యం. నేను అడిగితే ఆయన ఎలాగూ ఒప్పుకోరు. కిం కర్తవ్యం?” అంది సరస్వతి.
“మామ్మా! మగవాడు భార్యని ఎంత హీనంగా చూసినా తల్లిని మాత్రం ఎప్పుడూ కాదనలేదు. నువ్వే అడుగు తల్లీ - నాన్నగారు కాదనరనే అనుకుంటాను” అన్నాడు నారదుడు.
ఇంతలో బ్రహ్మ “అమ్మా మీరొచ్చారా! కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా” అంటూ లక్ష్మీదేవి పాదాలంటాడు.
“కుమారా! నేను నిన్నో కోరిక కోరడానికి వచ్చాను. కాదనకూడదు” అంది లక్ష్మి.
“చెప్పు తల్లీ! నీవు కోరడమా! ఆజ్ఞాపించు” అన్నాడు బ్రహ్మ. లక్ష్మీదేవి కావల్సింది చెప్పింది.
“కానీ తల్లీ అలాచేస్తే…”
“మరేమీ చెప్పకు - నేను చెప్పింది చెయ్యి అంతే ” అన్నాది అమ్మ.
సరే అంటూ - బ్రహ్మ సాఫ్ట్వేర్ లో కొన్ని మార్పులు చేసాడు.
“అమీనా - ఇది లైవ్ అప్డేట్ తో నడిచే సాఫ్ట్వేర్. ఇప్పటినుంచీ ఏ అమ్మాయిగానీ ఏ అబ్బాయినైనా పెళ్ళి చేసుకుందాం అని అనుకున్నా, అబ్బాయి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నా ఆ అబ్బాయి నుదుటి మీద ఒక ఎల్.సి.డి. తెర ప్రత్యక్షమౌతుంది. అందులోనువ్వు కోరుకున్న వివరాలు కనిపిస్తాయి. ఒక్క మాట - ఇది నీ సమస్యకు సమాధానం కాదు అని నీకనిపించిననాడు అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గ మాయమ్మను స్మరించు. అంతా తిరిగి సద్దుకుంటుంది ” అని చెప్పాడు.
“ఒక్కమాట స్వామీ, నేను అడిగే వరకు మగజాతి అంతా కలిసి వచ్చి అడిగినా నువ్వు ఈ ఫీచర్ తీసివేయడానికి లేదు” అంది అమీనా.
సరే అంటూ, తన మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లో కొన్ని మీటలు నొక్కాడు. సృష్టి 25.0 - Go Live అనే బటన్ వచ్చింది. “ఆమనీ మరొక్కసారి ఆలోచించుకో - నిజంగా ఇది నీ సమస్యకి సమాధానమా” అని అడిగాడు. “ఏమిటి స్వామీ ఇంకా ఆలోచిస్తున్నారు? నొక్కండి” అంటూ తొందరపెట్టింది ఆమని. ఆమనికి బ్రహ్మ మూడు ముఖాలు కనిపిస్తున్నాయి. వెనక ఉన్న నాల్గవ ముఖంతో సరస్వతి వంక చూసి కన్ను కొట్టి “ఈ మానవులు తాము చాలా తెలివైనవాళ్ళం అనుకుంటారు - శాపాల్ని కూడా వరం అనుకుని తీసుకునే వీళ్ళను చూస్తే ఒక వంక జాలీ, ఒక వంక నవ్వూ ఆగడం లేదు” అంటూ ఎంటర్ బటన్ నొక్కాడు.
———— మొదటి అధ్యాయం సమాప్తం —————
(సశేషం)